Asia Cup 2023: ఆసియా కప్ జరగడం కష్టమేనా?

శ్రీలంక రాజధాని కొలంబోలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆదివారం కొలంబోలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.

Asia Cup 2023: శ్రీలంక రాజధాని కొలంబోలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆదివారం కొలంబోలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. శనివారం నుంచి అక్కడ సూపర్-4 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సూపర్-4 షెడ్యూల్‌ను మార్చే ఆలోచనలో ఉంది.

కొలంబోలో ఇదే పరిస్థితి కొనసాగితే ఈ మ్యాచ్‌ను దంబుల్లా లేదా క్యాండీలోని పల్లెకెలె స్టేడియంకు మార్చవచ్చు . అయితే శనివారం పల్లెకెలెలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. ఇక్కడ ఆదివారం కూడా రోజంతా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఈ స్టేడియంలో సోమవారం భారత్, నేపాల్ మధ్య మ్యాచ్ జరగనుంది. రిపోర్ట్ ప్రకారం ఆ మ్యాచ్ కి కూడా వర్షం అంతరాయం ఏర్పడే అవకాశముంది. పరిస్థితులు మెరుగుపడకపోతే మ్యాచ్‌ను కొలంబో నుంచి వేరే చోటికి మార్చే అవకాశం ఉంది. దంబుల్లా శ్రీలంకలో తక్కువ వర్షపాతం ఉన్న నగరంగా ప్రసిద్ధి చెందింది. ఇంతకుముందు ఏసీసీ చాలా మ్యాచ్‌లను దంబుల్లాలో నిర్వహించాలని భావించిన సంగతి తెలిసిందే, అయితే భారత జట్టు అక్కడ ఆడేందుకు ఇష్టపడలేదు, అందుకే భారత్ లీగ్ మ్యాచ్‌లను పల్లెకెలె స్టేడియంలో నిర్వహించారు.

మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చైర్మన్ నజం సేథీ కూడా ఆసియా కప్ షెడ్యూల్‌పై ప్రశ్నలు సంధించారు. గత ఏడాది పీసీబీ చైర్మన్‌గా రమీజ్ రాజా ఉద్వాసనకు గురైన తర్వాత తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సేథీ, వర్షం కారణంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నిరాశపరిచిందని ఏసీసీపై మండిపడ్డారు. క్రికెట్‌లో అతిపెద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిందని చెప్పాడు. పిసిబి ఛైర్మన్‌గా నేను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఆడాలని ఎసిసిని కోరాను, అయితే శ్రీలంకలో ఆతిథ్యం ఇవ్వడానికి నిర్ణయించాయని తెలిపాడు.

పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత జట్టు నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్‌లో ఆసియా కప్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరుగుతుండగా, మిగిలిన మ్యాచ్‌లకు శ్రీలంకలో పీసీబీ ఆతిథ్యం ఇస్తోంది. గతేడాది ఇదే సమయంలో యూఏఈలో జరిగిన ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో ఆడారు.

Also Read: Dondakaya: దొండకాయ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్ళ బెట్టాల్సిందే?