U19 WC Final: హోరాహోరీ ఖాయం.. త‌గ్గేదేలే అంటున్న కుర్రాళ్ళు

  • Written By:
  • Publish Date - February 5, 2022 / 02:08 PM IST

అండ‌ర్-19 ప్ర‌పంచ క‌ప్‌లో దుమ్మురేపుతున్న‌ టీమ్ ఇండియా కుర్రాళ్ళు వరుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌కు చేరిన సంగ‌తి తెలిసిందే. మ్యాచ్‌లు జ‌ర‌గుతున్న కొద్దీ ఒక‌వైపు యంగ్ ఇండియా బ్యాటింగ్ లైన‌ప్ ఓ రేంజ్‌లో ప‌టిష్టంగా మార‌గా, బౌలింగ్ కూడా దుర్భేద్యంగా మారింది. దీంతో ఆస్ట్రేలియాతో జ‌రిగిన సెమీస్‌లో భార‌త్ బ్యాట్స్‌మెన్స్‌ను కంగారు పెట్టినా, ఆ త‌ర్వాత నిల‌క‌డైన బ్యాటింగ్‌తో చేల‌రేగి ఆసీస్‌ను మ‌ట్టి క‌రిపించింది. దీంతో గ‌త ఈవెంట్‌లో ఫైన‌ల్‌లో ఓట‌మిపాలైన ఇండియా ఈసారి ఎలాగైనా ప్ర‌పంచ‌క‌ప్‌ను సొంతం చేసుకోవాల‌ని భావిస్తోంది.

ఇక టాప్ ఆర్డ‌ర్‌తో పాటు లోయర్‌ మిడిలార్డర్‌లో నిశాంత్, దినేశ్‌ వరకు జట్టులో మెరుపులు మెరిపించే సమర్థులు ఉండ‌డం టీమ్‌కు క‌లిసివ‌స్తోంద‌ని చెప్పాలి. నిశాంత్ బ్యాట్‌తో పాటు అవ‌స‌ర‌మైన‌ప్పుడు బౌలింగ్‌లోనూ అద‌ర‌గొడుతూ జ‌ట్టులో కీల‌కంగా మారాడు. అలాగే రెగ్యుల‌ర్ బౌల‌ర్లు ర‌వికుమార్, విక్కీ, కౌశ‌ల్‌లు బౌలింగ్‌లో రాణిస్తూ, ప్ర‌త్య‌ర్ధి బ్యాట్స్‌మెన్స్‌ను ముప్పుతిప్ప‌లు పెడుతూ, వారికి చుక్కలు చూపిస్తున్నారు. దీంతో టీమ్ ఇండియా యంగ్ బ్యాట్స్‌మెన్స్‌తో పాటు బౌలింగ్ ద‌ళం మ‌రోసారి జూలు విదిలిస్తే భార‌త్ 5వ సారి అండర్-19 ప్ర‌పంచ క‌ప్‌ను ముద్దాడుతుంది.

మ‌రోవైపు ఇంగ్లండ్‌ కూడా అండ‌ర్-19 ప్ర‌పంచ‌కప్ ఫైన‌ల్‌కు చేరిన సంగ‌తి తెలిసిందే. 1998లో అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌ను ద‌క్కించుకున్న ఇంగ్లండ్, ఆ త‌ర్వాత ఒక్క‌సారి కూడా ఫైన‌ల్‌కు చేరుకోలేక‌పోయింది. అయితే ఈసారి మంచి ఊపుమీద ఉన్న యంగ్ ఇంగ్లండ్ టీమ్ ఫైన‌ల్లో భార‌త్ పై గెలిచి క‌ప్ కొట్టాల‌ని భావిస్తోంది. ఇంగ్లండ్ తుది జ‌ట్టులో ఉన్న 11 మందిలో నెంబ‌ర్ 8వ‌ర‌కు పరుగులు చేసే బ్యాట్స్‌మెన్స్ ఉండ‌డం ఆ జ‌ట్టుకు క‌లిసి వ‌స్తుంది. బౌలింగ్‌లో కూడా బైడెన్, రేహన్‌ అహ్మద్, అస్పిన్‌వాల్‌లు ప్ర‌త్య‌ర్ధి బ్యాటర్ల‌ను కుదురుకోకుండా చేస్తున్నారు. దీంతో రెండు ప‌టిష్ట జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతుండ‌డంతో హోరాహోరీ త‌ప్ప‌ద‌ని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. మ‌రి ఈసారి అండర్-19 ప్ర‌పంచ‌క‌ప్ ఎవ‌రి సొంతం అవుతుందో చూడాలి.