HCA elections: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీన ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలను కూడా ప్రకటిస్తారు. బరిలో మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్‌తో పాటు.. పీఎల్ శ్రీనివాస్ ప్యానల్‌లు పోటీలో నిలిచాయి. అయితే ప్రధానంగా రెండు ప్యానెల్స్ మధ్యనే పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అధికార పార్టీ బీఆర్‌ఎస్ మద్దతుతో బరిలో దిగుతున్నాడు జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు. మరోవైపు బీజేపీకి చెందిన హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి తన ప్యానల్‌ను రేసులో నిలిపారు. దీంతో ఈ ఎన్నికల్లో ఈ రెండు ప్యానల్స్ మధ్యనే ప్రధానంగా పోటీ కనిపిస్తున్నది. అయితే కేటీఆర్, హరీశ్ రావు అండదండలు ఉన్న జగన్‌మోహన్ రావు ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమంటున్నారు.
ఎన్నికల్లో మొత్తం 173 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బేసిక్ మెజారిటీ సాధించేందుకు 87 ఓట్లు అవసరం పడతాయి. హెచ్‌సీఏ ఓటర్ల జాబితాలో 48 మంది ఇనిస్టిట్యూషన్స్, 9 ఉమ్మడి జిల్లాల అసోసియేషన్లు, 15 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. ఇదిలా ఉండగా 2019 హెచ్‌సీఏ ఎన్నికల్లో మాజీ టీమిండియా ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ ప్యానెల్ విజయం సాధించింది. దీంతో మహ్మద్ అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పదవి చేపట్టారు.
Also Read: Telangana: సిద్దిపేటలో హరీష్ లాగ నేను అభివృద్ధి చేసేవాడిని కాదు: CM KCR