Harshal Patel: అతను 15 కోట్ల ప్లేయర్ – సెహ్వాగ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు.

  • Written By:
  • Publish Date - May 27, 2022 / 11:19 AM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. ఎలిమినేటర్ మ్యాచ్ చివరి ఓవర్ లో లక్నో 22 పరుగుల చేయాల్సిన తరుణంలో హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆర్ సీబీ కి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో కేవలం ఇరవై ఐదు పరుగులు ఇచ్చిన హర్షల్ పటేల్….ప్రమాదకరమైన స్టోయినిస్ వికెట్ తీశాడు. అతడిపై టీమ్ యాజమాన్యంతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల్ని కురిపిస్తున్నారు. మాజీ ఓపెనర్ సెహ్వాగ్ అయితే హార్శల్ ను ఆకాశానికి ఎత్తేశాడు.

అతడు 14 నుంచి 15 కోట్ల ధర పలకాల్సిన ఆటగాడని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. డెత్ ఓవర్స్ లో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీసే నైపుణ్యం హర్షల్ పటేల్ కు ఉందని సెహ్వాగ్ అన్నాడు. మ్యాచ్ ను మలుపు తిప్పే ప్రతిభా పాఠవాలున్న క్రికెటర్ అని పేర్కొన్నాడు. 15 కోట్ల ధరకు అతడు పూర్తిగా అర్హుడని అభిప్రాయ పడ్డాడు. ఈ సీజన్ లో హర్షల్ పటేల్ 19 వికెట్లు తీశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఫిబ్రవరి లో జరిగిన మెగా వేలంలో హర్షల్ పటేల్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.

2021 ఐపీఎల్ సీజన్ లో హర్షల్ అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్ లో అద్భుతంగా రాణించిన ఈ పేసర్ 15 మ్యాచ్ ల్లో 32 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకూ మొత్తం 77 మ్యాచ్ లలో 97 వికెట్లు పడగొట్టాడు.
ఈ సీజన్ లో బెంగుళూరు సాధించిన పలు విజయాల్లో హర్షల్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే ఇవాళ జరుగనున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ తో టైటిల్ కోసం పోటీ పడుతుంది.