హ్యారీ బ్రూక్ విధ్వంసం.. 27 బంతుల్లోనే 90 ప‌రుగులు!

రూట్ ఒక వైపు ఇన్నింగ్స్‌ను నిలకడగా కొనసాగిస్తుంటే హ్యారీ బ్రూక్ మాత్రం తన విస్ఫోటన బ్యాటింగ్‌తో శ్రీలంక బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు.

Published By: HashtagU Telugu Desk
Harry Brook

Harry Brook

Harry Brook: కొలంబోలోని ఆర్. ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో హ్యారీ బ్రూక్ తన మెరుపు బ్యాటింగ్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్ తన బ్యాట్‌తో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బ్రూక్ తన వన్డే కెరీర్‌లో మూడో సెంచరీని కేవలం 57 బంతుల్లోనే బాదేశాడు. విధ్వంసకర రీతిలో బ్యాటింగ్ చేసిన బ్రూక్ తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. బ్రూక్ ధాటికి శ్రీలంక బౌలింగ్ అటాక్ పూర్తిగా నిస్సహాయంగా మారిపోయింది.

హ్యారీ బ్రూక్ సృష్టించిన విధ్వంసం

జాకబ్ బెథెల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్‌పై జట్టు రన్ రేట్‌ను పెంచాల్సిన బాధ్యత పడింది. ఆ బాధ్యతను బ్రూక్ అద్భుతంగా నిర్వర్తించాడు. జో రూట్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 191 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Also Read: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత మేర ఖర్చు చేయాలంటే !!

రూట్ ఒక వైపు ఇన్నింగ్స్‌ను నిలకడగా కొనసాగిస్తుంటే హ్యారీ బ్రూక్ మాత్రం తన విస్ఫోటన బ్యాటింగ్‌తో శ్రీలంక బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. 66 బంతులు ఆడిన ఇంగ్లీష్ కెప్టెన్ 206 స్ట్రైక్ రేట్‌తో 136 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతను 11 సార్లు బంతిని బౌండరీ లైన్ దాటించగా, 9 సార్లు బంతిని గాల్లోకి లేపి నేరుగా ప్రేక్షకుల మధ్యకు పంపాడు.

27 బంతుల్లోనే 90 పరుగులు హ్యారీ బ్రూక్ మొదట 39 బంతులు ఆడే సమయానికి 46 పరుగులతో ఉన్నాడు. అయితే ఆ తర్వాత అసలైన విధ్వంసం మొదలైంది. తర్వాతి 27 బంతుల్లో బ్రూక్ మెరుపు వేగంతో ఏకంగా 90 పరుగులు పిండుకున్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చివర్లో వచ్చిన 69 పరుగులలో కేవలం ఒకే ఒక్క పరుగు జో రూట్ బ్యాట్ నుంచి రాగా, మిగిలిన 68 పరుగులు హ్యారీ బ్రూక్ సాధించినవే కావడం విశేషం. కెప్టెన్ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ ధాటికి ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. జో రూట్ తన వన్డే కెరీర్‌లో 20వ సెంచరీ పూర్తి చేసి 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

  Last Updated: 27 Jan 2026, 08:01 PM IST