Site icon HashtagU Telugu

Harmanpreet Kaur: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్‌

Harmanpreet Kaur

Harmanpreet Kaur

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్‌ (Harmanpreet Kaur)ను ఆ జట్టు యాజమాన్యం నియమించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. WPL వేలంలో హర్మన్‌ను ఆ జట్టు రూ.1.8కోట్లకు కొనుగోలు చేసింది. ఈనెల 4వ తేదీన DY పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ఆడనుంది.

ముంబై ఇండియన్స్ మహిళల ప్రీమియర్ లీగ్‌ లో తమ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఇప్పుడు ఇద్దరు భారత కెప్టెన్లు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్లుగా ఉన్నారు. ఇప్పటికే పురుషుల ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సారధిగా ఉన్నాడు. హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఈ క్లబ్‌లో చేరింది. హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత మహిళల జట్టు గత నెలలో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌ లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

హర్మన్‌ప్రీత్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆమె మూడు టెస్టులు, 124 వన్డేలు, 151 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ముంబై జట్టులో హర్మన్‌తో పాటు ఇంగ్లండ్‌కు చెందిన నటాలీ సీవర్, న్యూజిలాండ్‌కు చెందిన అమేలియా కెర్ వంటి వెటరన్ ప్లేయర్లు కూడా ఉన్నారు. హర్మన్‌ప్రీత్‌కు 20 ఏళ్ల వయసులో క్రికెట్ లో అరంగేట్రం చేసింది. ఆమె మార్చి 2009లో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. హర్మన్‌ప్రీత్‌ కు అర్జున అవార్డు కూడా వచ్చింది.

హర్మన్‌ప్రీత్ నియామకాన్ని టీమ్ ఓనర్ నీతా అంబానీ ప్రకటించారు. “మొదటి మహిళల క్రికెట్ జట్టు ముంబై ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్ కెప్టెన్‌గా ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది. జాతీయ కెప్టెన్‌గా, ఆమె భారత మహిళల జట్టును అత్యంత ఉత్కంఠభరితమైన విజయాల వైపు నడిపించింది. కోచ్ షార్లెట్ ఎడ్వర్డ్స్, మెంటర్ ఝులన్ గోస్వామి మద్దతుతో హర్మన్ మా MI మహిళా జట్టును వారి అత్యుత్తమ క్రికెట్ ఆడేందుకు, మరిన్ని విజయాలను అందుకోవడానికి స్ఫూర్తిని ఇస్తారని అనుకుంటున్నానని అన్నారు.

టోర్నీలో ముంబై జట్టు తమ తొలి మ్యాచ్‌ని మార్చి 4న గుజరాత్ జెయింట్స్‌తో డివై పాటిల్ స్టేడియంలో ఆడనుంది. వేలంలో ముంబై తన ఐదుగురు ఆటగాళ్లపై కోటి రూపాయలకు పైగా వెచ్చించింది. ఈ బృందం నటాలీ సేవర్‌పై ఎక్కువ డబ్బు ఖర్చు చేసి 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అదే సమయంలో ముంబై పూజా వస్త్రాకర్, అమేలియా కర్, యాస్తికా భాటియా కోసం కోటికి పైగా ఖర్చు చేసింది.

ముంబై ఇండియన్స్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్, నటాలీ స్కీవర్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్ వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుర్జార్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రిటన్, హుమైరా కాజీ, నేలమ్, ప్రియాంక బాలా, సోలమ్ బిష్ట్, జింటిమణి కలిత.