శ్రీలంక టూర్ ను భారత మహిళల జట్టు ఘనంగా ఆరంభించింది. దంబుల్లా వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో 34 పరుగుల తేడాతో శ్రీలంక మహిళల జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. రోడ్రిగ్స్ 36, షెఫాలీ వర్మ 31, హర్మన్ ప్రీత్ కౌర్ 22 పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో రణవీర మూడు, రణసింగే రెండు, ఆటపట్టు తలో వికెట్ పడగొట్టారు. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ఆరంభం నుంచీ కట్టడి చేశారు. దీంతో లంక ఎక్కడ కూడా లక్ష్యం దిశగా సాగినట్టు కనిపించలేదు. ఓపెనర్లు విష్మి గుణరత్నె 1, చమారి ఆటపట్టు 16, హర్షిత మాదవి 10 రన్స్ చేసి త్వరగా ఔటయ్యారు. .మిడిలార్దర్ బ్యాటర్ కవిష దిల్హరి 49 బంతులలో 47 నాటౌట్ చివరివరకు ఆడినా జట్టును గెలిపించలేకపోయింది. దీంతో లంక 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 104 పరుగులే చేసింది. భారత జట్టులో రాధా యాదవ్ రెండు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, పూజ వస్త్రకర్ తలో వికెట్ పడగొట్టారు.రోడ్రిగ్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో సీరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 శనివారం జరగనుంది.
Womens T20 : భారత మహిళలదే తొలి టీ ట్వంటీ

Harmanpreet Kaur