Hardik Pandya : అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి పాండ్యా థాంక్స్

ఐపీఎల్ 2022 సీజన్ ఆటగాళ్ల మెగా వేలం ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా జరగనుండగా.. ఈ వేలానికి ముందే కొత్త ఫ్రాంఛైజీలు ముగ్గురేసి చొప్పున ఆటగాళ్లని ఎంపిక చేసుకున్నాయి.

  • Written By:
  • Publish Date - January 24, 2022 / 11:58 AM IST

ఐపీఎల్ 2022 సీజన్ ఆటగాళ్ల మెగా వేలం ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా జరగనుండగా.. ఈ వేలానికి ముందే కొత్త ఫ్రాంఛైజీలు ముగ్గురేసి చొప్పున ఆటగాళ్లని ఎంపిక చేసుకున్నాయి. లక్నో ఫ్రాంఛైజీ.. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ని రూ.17 కోట్లకి జట్టులోకి తీసుకుని అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. అలాగే అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ హార్దిక్ పాండ్యను రూ.15 కోట్లకి దక్కించుకొని కెప్టెన్సీ అందించింది. 2015లో 10 లక్షల కనీస ధరకు ముంబై ఇండియన్స్‌లో అడుగుపెట్టిన హార్దిక్‌ పాండ్య ఆ జట్టునాలుగు ఐపీఎల్‌ టైటిళ్లు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2019, 2020 సంవత్సరాల్లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అయితే గత కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న హార్దిక్‌ను ఈసారి ముంబై జట్టు రిటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలోకి వచ్చిన పాండ్యాను ముందుగానే దక్కించుకున్న అహ్మదాబాద్ తమ జట్టుకు సారథిగా ఎంపిక చేసింది. కెప్టెన్‌గా ఎంపికైన త‌ర్వాత తొలి సారిగా హార్దిక్ పాండ్య స్పందించాడు. ఐపీఎల్‌లో అహ్మదాబాద్‌ జట్టుతో చేరేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న‌ట్లు హార్దిక్ పాండ్య చెప్పాడు. అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీతో తన సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాని, తన ప్రతిభను గుర్తించి సారథిగా ఎంపిక చేసిన ఫ్రాంచైజీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాని తెలిపాడు. అందివచ్చిన ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటానన్న హార్థిక్ ఐపీఎల్ 2022 సీజన్ లో అహ్మదాబాద్ జట్టుకు టైటిల్ అందించేందుకు తన శాయశక్తులా కృషిచేస్తానని చెప్పాడు. ఫామ్ కోల్పోవడంతోనే సౌతాఫ్రికా టూర్ కు కూడా హార్థిక్ పాండ్యా ఎంపిక కాలేదు. ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించి మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఆ ఆల్ రౌండర్ ఎదురుచూస్తున్నాడు.