IND vs IRE : సీరీస్ విజయంపై కన్నేసిన యంగ్ ఇండియా

  • Written By:
  • Publish Date - June 28, 2022 / 04:34 PM IST

ఐర్లాండ్ టూర్ ను గ్రాండ్ విక్టరీతో ఆరంభించిన భారత్ యువ జట్టు సీరీస్ విజయమే లక్ష్యంగా రెండో మ్యాచ్ కు సిద్ధమయింది. మొదటి మ్యాచ్‌ ప్రదర్శనే రిపీట్ చేయడం ద్వారా సీరీస్ ను స్వీప్ చేయాలని భావిస్తోంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్‌లో 20 ఓవర్ల కోటా పూర్తి కాలేదు. ఫలితంగా మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది. దీంతో 108 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 9.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ దీపక్ హుడా, కెప్టెన్ హార్దిక్ పాండ్య జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. గత మ్యాచ్‌లో రాణించిన ఓపెనర్ దీపక్ హుడా, ఇషాన్ కిషనే ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. గాయం కారణంగా తొలి మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేయకపోవడంతో వచ్చిన అవకాశాన్ని దీపక్ హుడా సద్వినియోగం చేసుకున్నాడు.

రుతురాజ్ ఫిట్‌గా లేకుంటే సంజూ శాంసన్ లేదా రాహుల్ త్రిపాఠికి అవకాశం దక్కోచ్చు. ఐపీఎల్‌లో సంజూ శాంసన్ మెరుగైన ప్రదర్శన చేసినా స్వదేశంలో జరిగిన సౌతాఫ్రికా సిరీస్‌కు పక్కన పెట్టారు. అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన రాహుల్ త్రిఫాఠి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌కు మరో అవకాశం ఇవ్వొచ్చు. బౌలింగ్ లో అర్షదీప్ సింగ్‌ చాలా కాలం నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. మరో పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ తొలి టీ ట్వంటీలో అరంగేట్రం చేసినా ఒకే ఓవర్ మాత్రమే బౌలింగ్ అవకాశం దక్కింది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్, ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ బరిలోకి దిగనున్నాడు. రవి బిష్ణోయ్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం చాహల్‌ బెంచ్‌కు పరిమితమవుతాడు. తొలి మ్యాచ్‌లో భువీ, చాహల్ సత్తా చాటారు. ఒకే వికెట్ తీసినా.. పొదుపుగా బౌలింగ్ చేశారు. మరోవైపు తొలి టీ ట్వంటీ లో పరవాలేదనిపించిన ఐర్లాండ్ చివరి మ్యాచ్‌లోనైనా గట్టి పోటీ ఇవ్వాలనుకుంటుంది. కాగా ఈ మ్యాచ్ కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.