HARDIK PANDYA : టీ ట్వంటీ ప్రపంచకప్ నా టార్గెట్ : పాండ్యా

ఐపీఎల్ 15వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఫామ్ కోల్పోయిన హార్థిక్ పాండ్యాను కెప్టెన్ గా పెట్టుకుని లీగ్ స్టేజ్ కూడా దాటలేరంటూ చాలా మంది పెదవి విరిచారు.

  • Written By:
  • Publish Date - June 11, 2022 / 02:52 PM IST

ఐపీఎల్ 15వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఫామ్ కోల్పోయిన హార్థిక్ పాండ్యాను కెప్టెన్ గా పెట్టుకుని లీగ్ స్టేజ్ కూడా దాటలేరంటూ చాలా మంది పెదవి విరిచారు. అయితే ఆ జట్టులో కీలక ఆటగాళ్ళు నిలకడగా రాణించడం, హార్థిక్ పాండ్యా కెప్టెన్సీ, ఇంకా సపోర్టింగ్ స్టాఫ్ ప్రోత్సాహంతో టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ సీజన్ గుజరాత్ కంటే కూడా హార్థిక్ పాండ్యా కెరీర్ కు అత్యంత కీలకమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ కూడా విఫలమై ఉంటే పాండ్యా కెరీర్ దాదాపుగా ముగిసిపోయి ఉండేది. అయితే ఫిట్ నెస్ సాధించి మళ్ళీ ఫామ్ అందుకున్న పాండ్యా ఆల్ రౌండర్ గా తనదైన ముద్ర వేశాడు. దీంతో సౌతాఫ్రికా సిరీస్ కోసం సెలక్టర్లు అతనికి పిలుపునిచ్చారు. ఒకవిధంగా చెప్పాలంటే పాండ్యా 2.0 ఇప్పుడే మొదలైందన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం సఫారీలతో సిరీస్ లో బిజీగా ఉన్న పాండ్యా తన కెరీర్ లో సెకండ్ ఫేజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ తనకు ఎంతో కీలకమని ఈ స్టార్‌ ఆల్ రౌండర్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యేందుకు ఇదే సరైన సమయం అని పాండ్యా తెలిపాడు. ఈ సిరీస్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని, దేశం తరపున ఆడడం ఎప్పుడూ ప్రత్యేకమేనని పాండ్యా చెప్పుకొచ్చాడు. తనను తాను అంటో నిరూపించుకునేందుకు ఈ సిరీస్ మరో అవకాశంగా భావిస్తున్నట్టు తెలిపాడు. సిరీస్ లో ప్రతీ మ్యాచ్ తనకు చాలా ముఖ్యమన్న పాండ్యా దాని కోసం శ్రమిస్తున్నట్టు చెప్పాడు. అయితే తన లక్ష్యం మాత్రం టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఆడడమేనని స్పష్టం చేశాడు. తన రిథమ్ ను ఇలాగే కొనసాగించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాలనుకుంటున్నట్టు పాండ్యా చెప్పాడు. ఈ సిరీస్ లో తన రోల్ కూడా మారిందన్నాడు. కెప్టెన్ కానని, బ్యాటింగ్ లో కూడా ముందుగా రానని చెప్పాడు. మళ్ళీ అందరికీ తెలిసిన హార్థిక్ గా తిరిగి వచ్చానంటూ వ్యాఖ్యానించాడు.

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పాండ్యా ఆల్‌రౌండర్‌గా అద్బుతమైన ప్రదర్శన చేశాడు. పాండ్యా 487 పరుగులతో పాటు 8 వికెట్లు కూడా పడగొట్టాడు. దీంతో వచ్చే టీ ట్వంటీ ప్రపంచకప్ లో పాండ్యానే కీలకం కానున్నాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ లోపు గాయాలు, ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే పాండ్యా గత రెండేళ్ళ కాలంలో పలు గాయాల బారిన పడడం, ఫిట్ నెస్ లేకపోవడంతో ఫామ్ కూడా కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలని మాజీ క్రికెటర్లు సైతం పాండ్యాకు సూచిస్తున్నారు.