Rohit Sharma: రోహిత్‌ ఇక కష్టమే.. తర్వాతి కెప్టెన్ అతడే

టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో వైఫల్యంతో భారత జట్టు కెప్టెన్సీ మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడే కాకున్నా షార్ట్ ఫార్మేట్‌లో రోహిత్‌శర్మ వారసునిగా హార్థిక్ పాండ్యాకే పగ్గాలు అప్పగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జట్టులో మరికొందరు ప్లేయర్స్ రేసులో ఉన్నా.. పాండ్యానే ఎందుకు...

  • Written By:
  • Updated On - November 11, 2022 / 02:47 PM IST

టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో వైఫల్యంతో భారత జట్టు కెప్టెన్సీ మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడే కాకున్నా షార్ట్ ఫార్మేట్‌లో రోహిత్‌శర్మ వారసునిగా హార్థిక్ పాండ్యాకే పగ్గాలు అప్పగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జట్టులో మరికొందరు ప్లేయర్స్ రేసులో ఉన్నా.. పాండ్యానే ఎందుకు…

రెండోసారి టీ ట్వంటీ వరల్డ్‌కప్ గెలుస్తుందని ఎన్నో అంచనాలు పెట్టుకున్న టీమిండియా సెమీఫైనల్లో పరాజయం పాలైంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. బౌలర్లు పూర్తిగా తేలిపోయిన వేళ మ్యాచ్ వన్‌సైడ్‌గా ముగిసిపోయింది. ఈ ఓటమితో కెప్టెన్ రోహిత్‌శర్మపై విమర్శలు వస్తున్నాయి. బీసీసీఐ సెలక్టర్లు టీ ట్వంటీ ఫార్మాట్‌కు సంబంధించి వచ్చే ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. దీనిలో భాగంగా కెప్టెన్సీ మార్పు ఖఛ్చితంగా చేయాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. రోహిత్‌ను టీ ట్వంటీ సారథిగా ఇప్పటికిప్పుడు తప్పించే పరిస్థితి లేకున్నా.. అతని వారసునిగా ఎవరికి అవకాశముందన్న దానిపై చర్చ జరుగుతోంది. కెప్టెన్సీ రేసులో ఆల్‌రౌండర్‌ హార్థిక్ పాండ్యానే ముందున్నాడు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి.. రోహిత్‌ ప్రస్తుత వయసు 35… వచ్చే ప్రపంచకప్ సమయానికి 37 ఏళ్ళు. అప్పుడు అతని ఫిట్‌నెస్ ఎలా ఉంటుందో అన్నది అనుమానమే. అదే సమయంలో పాండ్యా వయసు 29.. ఇంకా సుదీర్ఘ కెరీర్‌ ఉన్న ఆ ఆల్‌రౌండర్‌ ఫిట్‌నెస్ పరంగా బాగానే ఉన్నాడు.

పాండ్యా ఇప్పటికే ఐపీఎల్ సారథిగా తనను తాను నిరూపించుకున్నాడు. అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. కెప్టెన్సీ ఒత్తిడి ఉన్నా ఐపీఎల్ 15వ సీజన్‌లో నిలకడగా రాణించాడు. అన్నింటికీ మించి ఆల్‌రౌండర్‌ ట్యాగ్ పాండ్యాకు పెద్ద అడ్వాంటేజ్‌. బ్యాట్‌తో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడడమే కాదు.. బంతితోనూ మీడియం పేసర్‌గా జట్టుకు ఉపయోగపడుతున్నాడు. ఇక ఫీల్డింగ్‌లోనూ పాండ్యా గురించి ఎంత చెప్పినా తక్కువే. క్లిష్టమైన క్యాచ్‌లు అందుకోవడంలోనూ పాండ్యా చురుగ్గా ఉంటాడు. అందుకే కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్ళ కంటే పాండ్యానే బెటర్ ఆప్షన్‌గా చాలా మంది మాజీలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జరగనున్న న్యూజిలాండ్ టూర్‌కు సారథిగా పాండ్యా సిరీస్ విజయం సాధిస్తే ఫ్యూచర్ కెప్టెన్‌గా ప్రమోషన్‌ కొట్టినట్టేనని చెబుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడే బీసీసీఐ షార్ట్ ఫార్మాట్ కెప్టెన్సీ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం లేదని సమాచారం. కొంతకాలం వేచి చూసిన తర్వాత రోహిత్‌ స్థానంలో టీ ట్వంటీలకు పాండ్యాను ఎంపిక చేస్తారన్న వాదనా వినిపిస్తోంది. ఏదైతేనేం వచ్చే టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్‌ను పాండ్యా లీడ్ చేయడం ఖాయమైపోయినట్టే.