Hardik Pandya : తప్పించారాన్నది అవాస్తవం : పాండ్యా

సౌతాఫ్రికాతో జరగనున్న టీ ట్వంటీ సిరీస్‌లో అందరి దృష్టీ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాపైనే ఉంది.

  • Written By:
  • Publish Date - June 5, 2022 / 09:45 AM IST

సౌతాఫ్రికాతో జరగనున్న టీ ట్వంటీ సిరీస్‌లో అందరి దృష్టీ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాపైనే ఉంది. ఐపీఎల్‌కు ముందు ఫామ్‌, ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమైన పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జట్టును సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేయడమే కాదు వ్యక్తిగతంగానూ రాణించి ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ ప్రదర్శనతో పాండ్యా మళ్ళీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. సఫారీలతో సిరీస్‌కు ముందు ఒక ఎమోషనల్ మెసేజ్‌తో కూడిన వీడియోను పాండ్యా విడుదల చేశాడు. ఈ వీడియోలో పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకోగా.. గుజరాత్ టైటాన్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఏడాది పాటు టీమ్ ఇండియాకు దూరంగా ఉండటానికి గల కారణాల్ని హార్దిక్ వెల్లడించాడు. దీనిపై చాలా తప్పుడు ప్రచారాలు జరిగాయని చెప్పాడు. తనను ఎవరూ తప్పించలేదని, గాయం కారణంగా తానే చాలా రోజుల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నానని హార్దిక్ స్పష్టం చేశాడు. ఆ విషయం తెలియక చాలా మంది తనను సెలెక్టర్లు ఇండియన్ టీమ్ నుండి తొలగించారని అపోహపడ్డారని చెప్పుకొచ్చాడు. ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నాడు. క్రికెట్ కు దూరంగా ఉండాలన్నది తన సొంత నిర్ణయమని చెప్పాడు.

గాయం నుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పట్టిందని, ఈ గ్యాప్ లో తనను క్రికెట్ ఆడమంటూ బీసీసీఐ ఎప్పుడూ బలవంతపెట్టలేదని చెప్పాడు. మద్ధతుగా నిలిచిన బీసీసీఐకి, కుటుంబానికి పాండ్యా కృతజ్ఞతలు తెలిపాడు. ఐపీఎల్‌లో తనను టీమ్ కెప్టెన్‌గా ఎంపిక చేసినప్పుడు చాలా మంది పెదవి విరిచారని గుర్తు చేసుకున్నాడు. అయితే తాను ఆటపైనే ఫోకస్ చేసానని, గుజరాత్ జట్టులో అందరి సపోర్ట్‌తో టైటిల్ సాధించామన్నాడు. నిజానికి గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్‌లో పాండ్యా ఘోరంగా విఫలమయ్యాడు. ఎన్నో అంచనాలు పెట్టుకుంటే ఏమాత్రం రాణించలేకపోయాడు. కపిల్‌దేవ్ తర్వాత మంచి ఆల్‌రౌండర్ దొరికాడంటూ ఫ్యాన్స్ అనుకుంటున్న సమయంలో పాండ్యా ఫామ్‌ కోల్పోవడం అందరినీ నిరాశపరిచింది. దీనితో పాటు ఫిట్‌నెస్ సమస్యలు కూడా వెంటాడడంతో జట్టుకు దూరమయ్యాడు. ఇక పాండ్యా కెరీర్ ముగిసినట్టేనన్న అభిప్రాయాలూ వినిపించాయి. అయితే ఐపీఎల్ 15వ సీజన్‌తో మళ్ళీ తనను తాను నిరూపించుకున్న పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలిపాడు. దీంతో సౌతాఫ్రికాతో సిరీస్‌కు సెలక్టర్ల పిలుపు అందుకున్న పాండ్యా ఇప్పుడు ఆల్‌రౌండర్‌గా జాతీయ జట్టులోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. ఐపీఎల్ తొలి సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్య కృషి చాలా ఉంది. సమిష్టిగా టీమ్ ను ముందుకు నడిపించడంలో హార్దిక్ సక్సెస్ అయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటిక్ 487 రన్స్ తో పాటు ఎనిమిది వికెట్లు తీశాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్న పాండ్యా ఎలా ఆడతాడనేది ఆసక్తిరంగా మారింది.