Hardik Pandya: పాండ్యాకు బిగ్ ప్రమోషన్‌ ఖాయమే

ఏడాది క్రితం కెరీర్ ముగిసినట్టే అన్న విమర్శలు.. గాయంతో ఫిట్‌నెస్ సమస్యలు..జాతీయ జట్టు నుంచి ఔట్

  • Written By:
  • Updated On - August 4, 2022 / 04:33 PM IST

ఏడాది క్రితం కెరీర్ ముగిసినట్టే అన్న విమర్శలు.. గాయంతో ఫిట్‌నెస్ సమస్యలు..జాతీయ జట్టు నుంచి ఔట్…సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఐపీఎల్‌లో కొత్త జట్టు కెప్టెన్‌గా ఎంట్రీ…తన ఆల్‌రౌండ్ నైపుణ్యంతో టీమ్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు… ఇదీ గత ఏడాది కాలంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా ప్రయాణం.. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతుక్కోవాలన్న చందాన ఫిట్‌నెస్ సాధించి.. ఫామ్ అందుకున్న హార్థిక్ పాండ్యా గ్రాండ్‌గా మళ్ళీ జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ ఫామ్ ఏదో గాలివాటం కాదన్న రీతిలో వరుస సిరీస్‌లలో నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పుడు హార్థిక్ టైమ్ నడుస్తోందన్న ఫ్యాన్స్ మాటలను నిజం చేస్తూ సెలక్టర్లు అతనికి బిగ్ ప్రమోషన్ ఇవ్వబోతున్నారు. షార్ట్ ఫార్మాట్‌లో టీమిండియా రెగ్యులర్‌ వైస్ కెప్టెన్‌గా హార్థిక్ పాండ్యా పేరును పరిశీలిస్తున్నారు.

సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన సిరీస్‌కు పాండ్యా వైస్‌కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అప్పటి నుంచీ వరుస సిరీస్‌లలో పాండ్యా నిలకడగా రాణిస్తున్నాడు. ఐర్లాండ్ టూర్‌లో సారథిగా బాధ్యతలు చేపట్టిన పాండ్యా గతంతో పోలిస్తే ఆటపరంగా బాగా మెరుగయ్యాడు. మరోవైపు రెగ్యులర్ వైస్ కెప్టెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్ గాయాలతో దూరమవుతుండడం సెలక్టర్లు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ఆసియా కప్‌, టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు వైస్ కెప్టెన్‌గా హార్థిక్ పేరును ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జట్టులో నిలకడగా రాణిస్తున్న సీనియర్ ఆటగాళ్ళలో పాండ్యానే ముందున్నాడని బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్ర వేస్తున్న పాండ్యాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రమోషన్ ఇవ్వాలన్నది సెలక్టర్ల అభిప్రాయంగా భావిస్తున్నారు. నిజానికి రోహిత్‌శర్మ తర్వాత భారత జట్టు కెప్టెన్సీ రేసులో పంత్, రాహుల్ పేర్లు వినిపించినా…హార్థిక్ పాండ్యాను కూడా బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ కారణంగానే పలు సిరీస్‌లకు వైస్ కెప్టెన్‌గా, ఐర్లాండ్‌ టూర్‌కు సారథిగా అవకాశం ఇవ్వడం ద్వారా అతని సామర్థ్యాన్ని అంచనా వేస్తోంది.

రోహిత్‌శర్మ మరో రెండేళ్ళ పాటు కొనసాగే అవకాశాలున్న వేళ ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో పాండ్యా కూడా ఉన్నాడన్నది తేలిపోయింది. ఈ లోపు పలు మేజర్ టోర్నీలకు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తే మరింత రాటుదేలే అవకాశముందని సెలక్టర్లు భావిస్తున్నారు. ఐపీఎల్ 15వ సీజన్‌లో కెప్టెన్‌గా హార్థిక్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఏ మాత్రం అంచనాలు లేని జట్టును విజేతగా నిలపడంలో సక్సెస్ అయ్యాడు. ఫామ్‌లో లేని ఆటగాడికి కెప్టెన్సీ ఇచ్చి తప్పు చేశారంటూ గుజరాత్ టైటాన్స్‌ యాజమాన్యంపై విమర్శలు వచ్చినా.. తన ఆటతీరుతో అవి తప్పని నిరూపించాడు. సారథిగానే కాదు వ్యక్తిగత ప్రదర్శనతోనూ ఆకట్టుకున్న పాండ్యాకు ఐపీఎల్ 15వ సీజన్ పెద్ద టర్నింగ్ పాయింట్‌గా చెప్పొచ్చు. మొత్తం మీద పరిణితి చెందిన ఆటతీరుతో రీఎంట్రీ ఇచ్చిన పాండ్యాకు ఇప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.