Site icon HashtagU Telugu

Hardik Pandya : దాదా చెప్పినా వినని పాండ్యా

Hardik Pandya

Hardik Pandya

భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో…వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం మరింత కష్టం. జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత భారీ అంచనాలు ఉండడం సహజం. అందుకు తగట్టుగానే రాణించకుంటే వేటు పడక తప్పదు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఫిట్ నెస్ సమస్యలతో ఆల్ రౌండర్ పదానికి పూర్తి న్యాయం చేయలేకపోతున్న పాండ్యా ప్రస్తుతం పూర్తి ఫిట్ గా మారాడు. వచ్చే ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్న పాండ్యాకు బీసీసీఐ ప్రెసిడెంట్ , భారత మాజీ కెప్టెన్ ఇటీవలే ఓ సలహా ఇచ్చాడు. తనను తాను నిరూపించుకునేందుకు రంజీ మ్యాచ్ లు ఆడాలని చెప్పాడు. అయితే పాండ్యా మాత్రం దాదా సలహాను పట్టించుకోనట్టే కనిపిస్తోంది. తాజాగా రంజీ ట్రోఫీ నుంచి త‌ప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌పై దృష్టిసారించి తిరిగి టీమిండియాలోలోకి ఎంట్రీ ఇచ్చేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్లడించాడు. దీంతో బరోడా జట్టుకు కేదార్ దేవ్‌ధర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన దేశవాళీ టోర్నీ రంజీట్రోఫీ ఈ నెల 10 నుంచి ప్రారంభంకానుంది. రెండు దశల్లో జరగనున్న ఈ టోర్నీలో ఫస్ట్‌ ఫేజ్ ఫిబ్రవరి నుంచి మార్చి 15 వరకు, రెండో దశ మే 30 నుంచి జూన్‌ 26 వరకు జరగనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. దేశంలోని 9 ప్రధాన నగరాలుఅహ్మదాబాద్‌, కోల్‌కతా, రాజ్‌కోట్‌, ఢిల్లీ, గౌహతి, కటక్‌, త్రివేండ్రం, చెన్నై, హర్యానాలో , 64 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్టు బీసీసీఐ తెలిపింది. మరోవైపు ఐపీఎల్‌లో కొత్త జట్టుగా ఎంట్రీ ఇచ్చిన అహ్మదాబాద్ కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. రాబోయే సీజన్ కోసం 15 కోట్ల రూపాయలకు అహ్మదాబాద్‌ హార్దిక్ ను దక్కించుకుంది.