Hardik Pandya: ఐర్లాండ్ సిరీస్‌కు కెప్టెన్‌గా హార్థిక్ పాండ్యా

ఐర్లాండ్ టూర్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - June 16, 2022 / 01:22 AM IST

ఐర్లాండ్ టూర్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌‌కు టైటిల్‌ అందించిన హార్దిక్ పాండ్యాకు ప్రమోషన్ దక్కింది. ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ ట్వంటీల సిరీస్‌ కోసం భారత జట్టుకు కెప్టెన్‌గా పాండ్యాను ఎంపిక చేసింది. అలాగే సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించిన సెలక్టర్లు ఐపీఎల్‌లో రాణించిన పలువురు యువ ఆటగాళ్ళకు పిలుపునిచ్చారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరపున అదరగొట్టిన రాహుల్ త్రిపాఠీకి తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. ఇక దక్షిణాఫ్రికా సిరీస్‌లో చోటు దక్కని సంజూశాంసన్, సూర్యకుమార్ యాదవ్ ఐర్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యారు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను నేరుగా ఇంగ్లాండ్‌కే పంపించనున్న నేపథ్యంలో దినేశ్ కార్తీక్‌, సంజూ శాంసన్‌లకు చోటు లభించింది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో సిరీస్‌లో ఆడుతున్న పలువురు ఆటగాళ్ళనే ఐర్లాండ్‌కు ఎంపిక చేశారు. హార్దిక్ కెప్టెన్సీలో టీమిండియా జూన్ 26, 28తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ ట్వంటీలు ఆడనుంది. ప్రస్తుతం సఫారీలతో సిరీస్‌కు హార్థిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌ను ఐపీఎల్‌లో విజయవంతంగా నడిపించిన పాండ్యా కెప్టెన్సీ అందరినీ ఆకట్టుకుంది. ఇదిలా ఉంచే దక్షిణాఫ్రికా సిరీస్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్, టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలోని సీనియర్ టీం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. దీంతో ఐర్లాండ్‌తో సిరీస్‌కు ఎన్‌సీఎ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. లక్ష్మణ్‌తో పాటు సితాన్షు కోటక్, సాయిరాజ్ బహుతులే, మునీష్ బాలి టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో ఉండనున్నారు. ప్రస్తుతం వీరు నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్‌లుగా పనిచేస్తున్నారు. టీమిండియాకు బాలి ఫీల్డింగ్ కోచ్‌గా, బహుతులే బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.

ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు ః
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.