Gujarat Titans: మిల్లర్ ది కిల్లర్…ఫైనల్లో గుజరాత్

ఐపీఎల్ 15వ సీజన్ లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కి దూసుకెళ్లింది. సీజన్ ఆరంభం నుంచీ వరుస విజయాలతో అదరగొడుతున్న గుజరాత్ తొలి క్వాలిఫైయర్ లోనూ తన జోరు కొనసాగించింది.

  • Written By:
  • Updated On - May 25, 2022 / 12:13 AM IST

ఐపీఎల్ 15వ సీజన్ లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కి దూసుకెళ్లింది. సీజన్ ఆరంభం నుంచీ వరుస విజయాలతో అదరగొడుతున్న గుజరాత్ తొలి క్వాలిఫైయర్ లోనూ తన జోరు కొనసాగించింది. బౌలర్లు నిరాశపరిచినా… బాటర్లు చెలరేగడంతో విజయాన్ని అందుకుంది.
మిల్లర్ మెరుపులు హైలైట్ గా నిలిచాయి.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ త్వరగానే ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాతే కెప్టెన్‌ సంజు శాంసన్‌ వచ్చీ రాగానే గుజరాత్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ సీజన్‌లో టాప్‌ ఫామ్‌లో ఉన్న జోస్‌ బట్లర్ ఆరంభంలో స్లో గా ఆడితే శాంసన్‌ దంచికొట్టాడు.
5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 26 బాల్స్‌లోనే 47 రన్స్‌ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ 20 బాల్స్‌లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 28 రన్స్‌ చేసి ఔటయ్యాడు. హెట్‌మయర్‌ నిరాశపరిచినా జోస్‌ బట్లర్‌ తన విధ్వంసకర ఫామ్‌ను కొనసాగించాడు. బట్లర్‌ 56 బాల్స్‌లో 89 రన్స్‌ చేసి రనౌటయ్యాడు. బట్లర్‌ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. దీంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 రన్స్‌ చేసింది.

భారీ టార్గెట్ చేదించే క్రమంలో గుజరాత్ కు రెండో బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ సాహా డకౌట్ అయ్యాడు. అయితే గిల్ , వేడ్ ఇన్నింగ్స్ నిలబెట్టారు. ధాటిగా ఆడి ఏడు ఓవర్లలో 72 పరుగులు జోడించారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో కెప్టెన్ హర్డిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్ పార్టనర్ షిప్ గుజరాత్ కు విజయాన్ని అందించింది. ముఖ్యంగా మిల్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చివరి ఓవర్లో విజయం కోసం 16 పరుగులు చేయాల్సి ఉండగా…మిల్లర్ హ్యాట్రిక్ సిక్సర్లతో గుజరాత్ ను ఫైనల్ కు చేర్చాడు. మిల్లర్ కేవలం 38 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 68 రన్స్ చేయగా ..పాండ్య 27 బంతుల్లో 40 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఓడినా రాజస్థాన్ కు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో ఆ జట్టు రెండో క్వాలిఫైయర్ ఆడుతుంది.