క్రికెటర్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు యో-యో టెస్ట్ (Yo-Yo Test) చేస్తారు. గత కొన్నేళ్లుగా భారత జట్టు ఈ పద్దతిని అనుసరిస్తోంది. టీమిండియాలో కొనసాగాలంటే ప్రతీ ఆటగాడు ఈ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఈ పద్దతిని ప్రవేశపెట్టారు. అయితే ఫిట్నెస్ సమస్యలతో తరచూ జట్టుకు దూరం అయ్యే హార్దిక్ (Hardik Pandya) ఏడాది కాలంగా అత్యంత ఫిట్ గా కనిపిస్తున్నాడు. ఆడిన టోర్నీలలో హార్దిక్ తన ఇమేజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు. ఒకప్పుడు తన ఫిట్నెస్ పై ట్రోల్స్ చేసిన విమర్శకులకు తన ఫిట్నెస్ తోనే సమాధానమిస్తున్నాడు.
తాజాగా హార్దిక్ యోయో స్కోర్ (Hardik Yoyo Score) బయటకు వచ్చింది. ఇది తెలిసి విమర్శకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవల ఒక ఈవెంట్‌లో హార్దిక్‌ను మీ టాప్ యో-యో టెస్ట్ స్కోర్ ఎంత అని అడిగారు. దీనిపై హార్దిక్ స్పందిస్తూ..21.7 అని సమాధానమిచ్చాడు. నిజానికి కట్ ఆఫ్ లెవెల్ కంటే ఈ స్కోర్ చాలా ఎక్కువ. దీంతో హార్దిక్ ఫిట్నెస్ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. 2019 ప్రపంచకప్‌లో గాయపడిన హార్దిక్ పాండ్యా శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. దీని తర్వాత అతను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. తిరిగి మైదానంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు గాయపడి జట్టుకు దూరమయ్యాడు. కానీ హార్దిక్ పట్టు వదలకుండా నిరంతరం శ్రమించాడు.
ఫలితంగా ఈరోజు అతను పూర్తిగా ఫిట్‌గా ఉండి టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆడుతున్నాడు. ఈ ఏడాది హార్దిక్ టి20 ప్రపంచకప్ లో బ్యాటర్ గా, బౌలర్ గానూ సత్తా చాటాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేశాడు. 3 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 222.64 స్ట్రైక్ రేట్‌తో 118 పరుగులు చేశాడు. 1 వికెట్ కూడా తీసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనకు అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. హార్దిక్ పాండ్యా 11 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 31.29 సగటుతో 532 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్‌లో 86 మ్యాచుల్లో 1769 పరుగులు, 84 వికెట్లు తీశాడు. 105 టీ20 మ్యాచ్‌లు ఆడి 1641 పరుగులు చేసి 87 వికెట్లు పడగొట్టాడు.
Read Also : NIMS : నిమ్స్ వైద్యుల ఘనత.. 10 ఏళ్లలో 1000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లు పూర్తి