IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రస్తుతం తీవ్ర విమర్శలలో చిక్కుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా ఆయన చేసిన ఓ వ్యాఖ్యకు జాతి వివక్ష (రేసిజం) పుంతలు తెరచినట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
కమెంటరీ సందర్భంగా హర్భజన్ మాట్లాడుతూ
“లండన్‌లో కాళీ టాక్సీల మీటర్ వేగంగా పరుగెడుతుంది… ఇక్కడ ఆర్చర్ సార్ మీటర్ కూడా అంతే వేగంగా పరుగెత్తింది” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలో ‘కాళీ టాక్సీ’ అన్న వ్యాఖ్యను ఆర్చర్ యొక్క చర్మం రంగుతో పోల్చుతూ మాట్లాడారని చాలామంది నెటిజన్లు విమర్శించారు. ఇది సూటిగా కాకపోయినా జాతి వివక్షకు ఉదాహరణగా మిగిలిందని అంటున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌పై హర్భజన్‌కు వ్యతిరేకంగా #ApologiseHarbhajan అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
హర్భజన్ సింగ్ కెరీర్‌లో తనూ ఎన్నోసార్లు జాతి వివక్షకు గురయ్యారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా టూర్‌లో ఆండ్రూ సైమండ్స్‌తో జరిగిన వివాదం దీనికి ఉదాహరణ. అయితే, ఇంత అనుభవం ఉన్న మాజీ క్రికెటర్ నుంచి ఇలాంటి వ్యాఖ్య రావడం పలువురు అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు హర్భజన్ తన వ్యాఖ్యపై ఏ విధమైన స్పందన ఇవ్వలేదు, క్షమాపణ చెప్పకపోవడం విశేషం. క్రీడా రంగానికి చెందిన వారు, వ్యాఖ్యాతలు మాటలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఐపీఎల్ నిర్వహకులు లేదా ప్రసార సంస్థ (బ్రాడ్‌కాస్టర్) నుంచి కూడా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సోషల్ మీడియాలో ఒత్తిడి పెరిగే కొద్దీ, హర్భజన్ క్షమాపణ చెప్పాల్సి వచ్చే అవకాశం లేకపోలేదు. అంతేకాదు, ప్రసార సంస్థ తగిన చర్యలు తీసుకోవచ్చన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి.
ఈ ఘటన మరోసారి క్రీడా వేదికలపై హాస్యం పేరుతో వచ్చే వ్యాఖ్యలకు హద్దులు ఉండాలా? అనే ప్రశ్నను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూసే ఐపీఎల్ వేదికపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత బాధ్యతా రాహిత్యమో, హర్భజన్ వ్యాఖ్య మరోసారి గుర్తు చేసింది. ఇకపై హర్భజన్ లేదా ప్రసార సంస్థ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. కానీ ఇప్పటికి సోషల్ మీడియాలో “టర్బనేటర్”గా ప్రసిద్ధి చెందిన హర్భజన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు.