Deepak Hooda:దూకుడుగా ఆడడమే నాకు ఇష్టం

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కూ విపరీతమైన పోటీ నెలకొంది. ఐపీఎల్ ద్వారా సత్తా చాటిన పలువురు యువక్రికెటర్లు సీనియర్లకు సవాల్ విసురుతున్నారు.

  • Written By:
  • Publish Date - June 29, 2022 / 03:39 PM IST

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కూ విపరీతమైన పోటీ నెలకొంది. ఐపీఎల్ ద్వారా సత్తా చాటిన పలువురు యువక్రికెటర్లు సీనియర్లకు సవాల్ విసురుతున్నారు. అలాగే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుంటే జట్టులో చోటు ఉండదని వారికి వారే తెలుసుకుంటున్నారు. గతంలో ఒక్కో ప్లేస్ కూ ఒకరిద్దరు మాత్రమే పోటీ పడితే.. ఐపీఎల్ పుణ్యమా అని ఇప్పుడు నలుగురు లేక ఐదుగురు రేసులో ఉంటున్నారు.

అందుకే ఛాన్స్ దొరికితే సత్తా చాటేందుకు యువ ఆటగాళ్ళు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఐర్లాండ్ టూర్ లో ఇలాగే వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న ప్లేయర్ దీపక్ హుడా.. తొలి టీ ట్వంటీలో రాణించిన హుడా.. రెండో టీ ట్వంటీలో ఏకంగా సెంచరీతో రెచ్చిపోయాడు. సంజూ శాంసన్ తో కలిసి రికార్డ్ పార్టనర్ షిప్ నమోదు చేశాడు. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన దీపక్ హుడా తన సక్సెస్ కు కారణాలను పంచుకున్నాడు.
ఐపీఎల్ లో బాగా రాణించడం వల్లనే భారత జట్టుకు ఎంపికయ్యానని చెప్పాడు. అదే ప్రదర్శనను ఇక్కడ కూడా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించాడు. దూకుడుగా ఆడటమే తనకు ఇష్టమన్న దీపక్ హుడా అవసరమైనంత మేరకు హిట్టింగ్ చేస్తానని చెప్పాడు. అలాగే ఈ మధ్య తన బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరిగాయని అందుకే పరిస్థితులకు తగ్గట్టు ఆడేలా తనను తాను మార్చుకున్నానని చెప్పుకొచ్చాడు.

తన కెరీర్ లో ఇప్పటి వరకూ ఓపెనింగ్ చేయలేదని, అయితే టీమ్ మేనేజ్ మెంట్ అప్పగించిన బాధ్యతను సవాల్ గా తీసుకుని సక్సెస్ అయ్యానని హుడా తెలిపాడు. ప్రస్తుతం జట్టులో పోటీ ఎక్కువ ఉన్న కారణంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుంటే వెనుకబడిపోతామని తెలుసన్నాడు హుడా ఈ ఏడాది ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అద్భుతంగా ఆడాడు. అతను 15 మ్యాచ్‌ల్లో 136.67 స్ట్రైక్ రేట్‌తో 451పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతోనే ఐర్లాండ్ టూర్ కు సెలక్టర్లు అతన్ని ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే ఐర్లాండ్ తో ఉత్కంఠభరితంగా సాగిన హైస్కోరింగ్ థ్రిల్లర్ లో భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.