Happy Birthday Virat Kohli: కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్: తండ్రి మరణవార్త విని కూడా.. కష్టాల్లో ఉన్న జట్టు కోసం బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ..!

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నవంబర్ 5వ తేదీన తన 35వ బర్త్ డే (Happy Birthday Virat Kohli) జరుపుకుంటున్నాడు. కోహ్లి ప్రస్తుతం క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టులో భాగంగా ఉన్నాడు.

  • Written By:
  • Updated On - November 5, 2023 / 09:55 AM IST

Happy Birthday Virat Kohli: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నవంబర్ 5వ తేదీన తన 35వ బర్త్ డే (Happy Birthday Virat Kohli) జరుపుకుంటున్నాడు. కోహ్లి ప్రస్తుతం క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టులో భాగంగా ఉన్నాడు. ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 442 పరుగులు చేశాడు. రానున్న మ్యాచ్‌ల్లోనూ కోహ్లి నుంచి బలమైన ప్రదర్శన ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

విరాట్ కోహ్లీ 5 నవంబర్ 1988న ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. మధ్యప్రదేశ్‌తో కోహ్లీకి లోతైన సంబంధాలు ఉన్నాయి. విభజన సమయంలో విరాట్ తాత కట్నీకి వచ్చారు. అయితే విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ కుటుంబంతో కలిసి ఢిల్లీకి వచ్చారు. 19 డిసెంబర్ 2006న విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ 54 సంవత్సరాల వయసులో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించాడు. ఆ సమయంలో విరాట్ వయసు కేవలం 18 ఏళ్లు. అతను ఢిల్లీలో రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. ఆ మ్యాచ్ లో ఢిల్లీ కర్ణాటకతో జరిగింది. ఢిల్లీని ఫాలోఆన్ నుంచి కాపాడేందుకు కోహ్లీ 90 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాతే తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. డిసెంబర్ 2017లో కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్లాడాడు. వీరికి ఒక పాప కూడా ఉంది.

We’re now on WhatsApp : Click to Join

విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత అండర్-19 జట్టు 2008లో ప్రపంచకప్ గెలిచింది. ఈ టోర్నీ మలేషియాలో జరిగింది. ఈ అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా కోహ్లి 18 ఆగస్టు 2008న శ్రీలంకపై టీమ్ ఇండియా తరపున తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. దేవధర్ ట్రోఫీ ఫైనల్‌లో జట్టుకు నాయకత్వం వహించిన రెండో అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ విరాట్ కోహ్లీ. అతను 2009-10 సీజన్ ఫైనల్‌లో నార్త్ జోన్‌కు నాయకత్వం వహించినప్పుడు అతని వయస్సు 21 సంవత్సరాల 124 రోజులు. నాలుగేళ్ల క్రితం శుభ్‌మన్ గిల్ (20 ఏళ్ల 57 రోజులు) విరాట్ రికార్డును బద్దలు కొట్టాడు.

దశాబ్ద కాలంలో అంతర్జాతీయంగా 20,000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. 35 ఏళ్ల విరాట్ 2019లో భారత వెస్టిండీస్ పర్యటనలో ఈ ఘనత సాధించాడు. ఆ పర్యటనలో వన్డే సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో భారత క్రికెటర్ ఈ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను 99 బంతుల్లో అజేయంగా 114 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. 2018లో వెస్టిండీస్‌పై అజేయంగా 157 పరుగులు చేయడంతో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ ఘనత సాధించడానికి అతను 205 ఇన్నింగ్స్‌లు ఆడగా, సచిన్ టెండూల్కర్ 10,000 ODI పరుగులను చేరుకోవడానికి 259 ఇన్నింగ్స్‌లు ఆడారు.

Also Read: England Knocked Out: ప్రపంచ కప్‌ నుంచి ఇంగ్లండ్ నిష్క్రమణ.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 33 రన్స్ తేడాతో ఓటమి..!

ఒక క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అతను 11 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. అతను 15 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన హషీమ్ ఆమ్లా రికార్డును వెనక్కి నెట్టాడు. రెండు జట్లపై వన్డేల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడు విరాట్ కోహ్లీ. ఫిబ్రవరి 2012- జూలై 2012 మధ్య శ్రీలంకపై కోహ్లీ 133*, 108, 106 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2018లో వెస్టిండీస్‌పై 140, 157*, 107 పరుగులు చేశాడు.

ఒక సంవత్సరంలో ఐసిసి వార్షిక వ్యక్తిగత అవార్డులన్నింటినీ గెలుచుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. 2018లో అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత కోహ్లీకి సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ, ICC టెస్ట్, ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ లభించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో కోహ్లి ఇప్పటివరకు ఎనిమిది సార్లు వన్డేల్లో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. కోహ్లి 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2023లో వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ వన్డే పరుగులు చేశాడు.

ప్రపంచ కప్ 2019 సెమీ-ఫైనల్‌లో భారత్ నిష్క్రమించినప్పటికీ ఈ మెగాటోర్నీలో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు సాధించిన తొలి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అతను ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్‌పై 82, 77, 67, 72 పరుగులు చేశాడు. వరుసగా మూడు క్యాలెండర్ సంవత్సరాల్లో 1000 పరుగులు చేసిన తొలి టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ 2016లో 1215 పరుగులు, 2017లో 1059 పరుగులు, 2018లో 1322 పరుగులు చేశాడు.

టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అత్యధికంగా 7 డబుల్ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. ఐపీఎల్ 2016లో 973 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో కోహ్లీ 11 సెంచరీలు సాధించాడు. 1998లో 12 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ మాత్రమే అతని కంటే ముందున్నాడు. 2018లో కోహ్లీ 11 సెంచరీలు చేశాడు. 2018లో టెస్టుల్లో అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. తన 65వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని తాకాడు. గతంలో బ్రియాన్ లారా ఈ ఫీట్ సాధించడానికి 71 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు వన్డేల్లో 13,525 పరుగులు చేయగా.. టెస్టుల్లో 8,676, టీ20ల్లో 4,008 పరుగులు చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్ లో కోహ్లీ ఇప్పటివరకు 78 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 49. 3, వన్డేల్లో 58. 05, టీ20ల్లో 52. 74 సగటుతో ఉన్నాడు. కింగ్ కోహ్లీ అర్జున, పద్మశ్రీ, ఖేల్ రత్న అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ఈరోజు దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి విరాట్ కోహ్లీకి బర్త్ డే కానుక ఇవ్వాలని రోహిత్ సేన చూస్తుంది. ఈ మ్యాచ్ లోనే కోహ్లీ 49వ వన్డే సెంచరీ చేస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.