South Africa: క్యాచ్ జారె..మ్యాచ్ పోయె

క్రికెట్ లో ప్రతీ బంతీ కీలకమే..ఒక్క క్యాచ్ చేజారినా మ్యాచ్ పోయినట్టే.. అందుకే క్యాచ్ విన్ మ్యాచెస్ అంటారు.. ఈ విషయం మరోసారి రుజువైంది.

  • Written By:
  • Publish Date - June 10, 2022 / 02:16 PM IST

క్రికెట్ లో ప్రతీ బంతీ కీలకమే..ఒక్క క్యాచ్ చేజారినా మ్యాచ్ పోయినట్టే.. అందుకే క్యాచ్ విన్ మ్యాచెస్ అంటారు.. ఈ విషయం మరోసారి రుజువైంది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ ట్వంటీలో భారత్ ఓటమికి బౌలింగ్ వైఫల్యమే కారణమనుకున్నా… శ్రేయాస్ అయ్యర్ జారవిడిచిన క్యాచ్ తో మ్యాచ్ పూర్తిగా చేజారిపోయింది. 29 పరుగుల వద్ద వాన్‌డెర్‌ డసెన్‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను శ్రేయస్‌ అయ్యర్‌ జారవిడిచాడు. అదే భారత్‌ కొంప ముంచింది. అనంతరం వాన్‌డెర్‌ డసెన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

తొలి 30 బంతుల్లో 29 పరుగులు చేసిన డసెన్‌.. అఖరి 16 బంతుల్లో 46 పరుగులు చేశాడు. శ్రేయాస్ ఎంత పని చేసావంటూ ఫ్యాన్స్ తిట్టుకున్నారు. మ్యాచ్‌ అనంతరం దీనిపై డసెన్‌ కూడా స్పందించాడు. డ్రాప్‌ చేసిన క్యాచ్‌కి టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని తనకు తెలుసని చెప్పాడు.
ఆరంభంలో బంతులను ఎదర్కొవడానికి కాస్త ఇబ్బంది పడ్డాననీ, ముందుగా బౌండరీలు కొట్టలేక జట్టును ఒత్తిడికి గురి చేశానన్నాడు, అయితే తన రిథమ్‌ను అందుకోవడానికి ఏదో ఒక బౌలర్‌ను టార్గెట్‌ చేయాలని అనుకున్నట్టు వెల్లడించాడు. వికెట్‌ బ్యాటింగ్‌కు చాలా బాగుందన్నాడు. కాగా జారవిడిచిన క్యాచ్‌కు భారత్‌ భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని తనకు తెలుసనీ, కొన్ని సార్లు అదృష్టం మనకు కలిసి వస్తుందన్నాడు. ఈ రోజు తాను అదృష్టవంతుడినని డసెన్ వ్యాఖ్యానించాడు.

టీమిండియాతో జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సఫారీల విజయంలో మిడిలార్డర్‌ బ్యాటర్లు మిల్లర్‌, వాన్‌డెర్‌ డసెన్‌ కీలక పాత్ర పోషించారు. 211 పరుగుల భారీ లక్ష్య చేధనలో టాప్‌ ఆర్డర్‌ విఫలమైనప్పటికీ.. మిల్లర్, వాన్‌డెర్‌ డసెన్‌ విజృంభించడంతో దక్షిణాఫ్రికా సునాయసంగా టార్గెట్ ఛేదించింది.