Site icon HashtagU Telugu

CWG Bronze: వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు రెండో పతకం

Gururaja

Gururaja

కామన్‌వెల్త్ గేమ్స్‌లో రెండోరోజు వెయిట్‌ లిఫ్టర్లు సత్తా చాటారు. సంకేత్ మహదేవ్ సర్గార్ రజతంతో తొలి పతకం అందిస్తే… మరో వెయిట్‌ లిఫ్టర్‌ గురురాజ పూజారి కాంస్య పతకం గెలిచాడు. పురుషుల 61 కేజీల విభాగంలో గురురాజ ఈ మెడల్ గెలిచాడు. తన మూడో ప్రయత్నంలో 151 కేజీలను ఎత్తి కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్ ఫేజ్‌లో మొత్తంగా 269 కేజీలను ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. మలేసియన్ వెయిట్ లిఫ్టర్ మహ్మద్ అజ్నీల్ 153 కేజీలతో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. గురురాజ పుజారి కెనడాకు చెందిన యూరీ సిమార్డ్ కంటే ఓ కేజీ అదనంగా లేపి కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు . మొత్తంగా రెండు దశల్లో 118 కేజీలు, 151 కేజీలు కలిపి 269 కేజీలు ఎత్తాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో కెనాడాకు చెందిన సిమర్డ్.. కాంస్యాన్ని సొంతం చేసుకునేందుకు చివరి వరకూ పోరాడాడు. గురురాజకు గట్టి పోటీనిచ్చినప్పటికీ.. చివరకు పతకం భారత అథ్లెట్‌నే వరించింది. సిమర్డ్ తన చివరి ప్రయత్నంలో 149 కేజీలు ఎత్తాడు. అయితే గురురాజా 151 కేజీలు ఎత్తి మెడల్‌ను సొంతం చేసుకున్నాడు.
పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రజతాన్ని గెల్చుకున్నాడు. తాజాగా గురురాజ పూజారి కాంస్యంతో శనివారం భారత్ పతకాల సంఖ్య రెండుకు చేరింది.

Exit mobile version