GT Beats PBKS: మళ్ళీ గెలుపు బాట పట్టిన గుజరాత్.. పంజాబ్ పై ఘనవిజయం

ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మళ్ళీ గెలుపు బాట పట్టింది.

Published By: HashtagU Telugu Desk
Shubman Gill

Shubman Gill

GT Beats PBKS: ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మళ్ళీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్ లో అనూహ్యంగా కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలైన గుజరాత్ పంజాబ్ పై జూలు విదిల్చింది. బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ ఆధపత్యం కనబరిచి పంజాబ్ ను చిత్తు చేసింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు పేలవమైన ఆరంభం లభించింది. ఓపెనర్లు నిరాశపరిచారు. ప్రభ్ సిమ్రాన్ డకౌటవగా.. ఫామ్ లో ఉన్న ధావన్ 8 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ 28 పరుగులే 2 వికెట్లు కోల్పోయింది. అయితే మాథ్యూ షార్ట్ , భనుక రాజపక్స నిలకడగా ఆడుతూ పంజాబ్ ఇన్నింగ్స్ నడిపించారు. ధాటిగా ఆడిన షార్ట్ 24 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 36 రన్స్ చేసి ఔటవగా.. రాజపక్స 20 రన్స్ చేశాడు. తర్వాత వికెట్ కీపర్ జితేశ్ శర్మ , శామ్ కరన్ రాణించారు. జితేశ్ శర్మ 23 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేయగా.. కరన్ 22 రన్స్ చేశాడు. చివర్లో పంజాబ్ వికెట్లు కోల్పోవడంతో స్కోర్ వేగం తగ్గింది. ఈ దశలో షారూఖ్ ఖాన్ ధాటిగా ఆడాడు. కేవలం 9 బంతుల్లోనే 1 ఫోర్ , 2 సిక్సర్లతో 22 రన్స్ చేయడంతో పంజాబ్ స్కోర్ 150 దాటింది.

బ్యాటింగ్ పిచ్ పై పంజాబ్ ను కట్టడి చేయడంలో గుజరాత్ బౌలర్లు సక్సెసయ్యారు. పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్న 2 వికెట్లు తీయగా.. షమీ, జోషువా లిటిల్, జోసెఫ్ , రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

లక్ష్యఛేదనలో గుజరాత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు సాహా, గిల్ తొలి వికెట్ కు 4.4 ఓవర్లలోనే 48 పరుగులు జోడించారు. సాహా 19 బంతుల్లో 5 ఫోర్లతో 30 పరుగులకు ఔటవగా.. శుభ్ మన్ గిల్ తన ఫామ్ కొనసాగించాడు. పంజాబ్ బౌలర్లపై ఎటాకింగ్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. అతనికి తోడుగా సాయిసుదర్శన్ కూడా రాణించాడు. పంజాబ్ బౌలర్లు పెద్దగా ప్రభూవం చూపలేకపోవడంతో ఛేజింగ్ లో గుజరాత్ కు ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. జట్టులోకి తిరిగి వచ్చిన రబాడా వికెట్ తీసినప్పటకీ… మిగిలిన బౌలర్లు విఫలమవడంతో పంజాబ్ టార్గెట్ ను సునాయాసంగానే ఛేదించింది. శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అటు మిల్లర్ కూడా సపోర్ట్ ఇవ్వడంతో గుజరాత్ 19.5 ఓవర్లలో టార్గెట్ అందుకుంది. గిల్ 47 బంతుల్లో 7 ఫోర్లు , 1 సిక్స్ తో 67 రన్స్ చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. తర్వాత తెవాటియా , మిల్లర్ గుజరాత్ విజయాన్ని పూర్తి చేశారు.

  Last Updated: 13 Apr 2023, 11:21 PM IST