IPL 2023: ఐపీఎల్ అంటే కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కాదు..సామాజిక సందేశాలిచ్చేందుకూ వేదికగా నిలుస్తుంటుంది. ఉదాహరణకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక మ్యాచ్ కోసం గ్రీన్ కలర్ జెర్సీ ధరిస్తుంది. తద్వారా పచ్చదనం పరిరక్షణపై సందేశాన్నివ్వడం ఆ జట్టుకు అలవాటు.
ఇప్పుడు ఆర్సీబీ బాటలోనే నడుస్తోంది గుజరాత్ టైటాన్స్. ఒక సామాజిక సందేశాన్నివ్వడం కోసం తన జెర్సీ రంగును మార్చుకుంటోంది. సన్ రైజర్స్ తో జరగనున్న మ్యాచ్ కు లావెండర్ కలర్ జెర్సీతో బరిలోకి దిగబోతోంది. క్యాన్సర్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్ధతుగానే లావెండర్ రంగు జెర్సీతో ఆడనుంది. మే 15న ఈ మ్యాచ్ జరగనుంది.
క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆ ఫ్రాంచైజీ వెల్లడించింది. అన్ని రకాల క్యాన్సర్ లనూ సూచించే లావెండర్ రంగును ఎంపిక చేసుకున్నట్టు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది మరణాలకు క్యాన్సర్ కారణమైందనీ, దీనిపై సానుకూల మార్పును తీసుకురావడానికి, జరుగుతున్న పోరాటానికి మద్ధతుగా ఉంటామని గుజరాత్ టైటాన్స్ సీవోవో కల్నల్ అరవిందర్ సింగ్ చెప్పారు. గుజరాత్ టైటాన్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్నారంటూ కితాబిస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన గుజరాత్ ఈ సీజన్ లోనూ అదరగొడుతోంది. ఇప్పటి వరకూ 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆ జట్టు ప్లే ఆఫ్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది.