Site icon HashtagU Telugu

GT vs RR playoff: బట్లర్ మా మీద చెలరేగకు… ప్లీజ్

Rr Vs Gt

Rr Vs Gt

ఐపీఎల్ 15వ సీజన్ లో లీగ్ స్టేజ్ కు తెరపడింది. ఇవాళ్టి నుంచి ప్లే ఆఫ్ సమరం మొదలు కాబోతోంది. తొలి క్వాలిఫయర్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో అందరి చూపు జోస్ బట్లర్ పైనే ఉంది. ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సెంచరీలతో అదరగొట్టాడు. గత మూడు మ్యాచ్ ల్లో నిరాశ పరిచినా…ఓవరాల్ గా ఐపీఎల్ 15వ సీజన్ ఆరెంజ్ క్యాప్ బట్లర్ దగ్గరే ఉంది. ఇప్పటి వరకు బట్లర్ 629 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.

ఈ నేపద్యంలో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ రాహుల్ తేవాటియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ ఖచ్చితంగా బట్లర్ కే దక్కుతుందని , అయితే అతను మాత్రం తమపై భారీ ఇన్నింగ్స్ ఆడకూడదని కోరుకుంటున్నట్టు వెల్లడించాడు. గతంలో రాహుల్ తేవాటియా రాజస్థాన్ రాయల్స్ కు ఆడాడు. అయితే మెగా వేలంలో తేవాటియాను గుజరాత్ దక్కించుకుంది. జోస్ బట్లర్ గురించి తనకు బాగా తెలుసని, మైదానంలో చాలా కూల్ గా ఉంటూ చెలరేగిపోతాడని చెప్పుకొచ్చాడు. తొలి క్వాలిఫయర్ లో బట్లర్ త్వరగా ఔటవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.

మరో ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కూడా ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తాడని గుర్తు చేశాడు. అందుకే మిల్లర్ కూడా తమపై ఆడకూడదని కోరుకుంటున్నట్టు చెప్పాడు. మిల్లర్ కూడా గతంలో రాజస్థాన్ రాయల్స్ కు ఆడినప్పుడు అతని ఆటతీరును గమనించానని తేవాటియ చెప్పాడు. కాగా ఇవాళ్టి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోతోంది. లీగ్ స్టేజ్ మొత్తాన్ని మహారాష్ట్రలో నిర్వహించిన బీసీసీఐ కోవిడ్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో కోల్ కతా లో ప్లే ఆఫ్ మ్యాచ్ లు , ఫైనల్ కు అహ్మదాబాద్ వేదికలుగా నిర్ణయించింది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.