Site icon HashtagU Telugu

Gujarat Titans: ప్లే ఆఫ్ లో గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ నుంచి సన్ రైజర్స్ ఔట్

Lavender Jersey

Gujarat Titans

Gujarat Titans: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 16వ సీజన్ లో ప్లే ఆఫ్ కు దూసుకెళ్ళింది. కీలక మ్యాచ్ లో అదరగొట్టిన గుజరాత్ సన్ రైజర్స్ పై 34 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో బౌలర్ల ఆధిపత్యమే కనిపించింది. సాధారణంగా అహ్మదాబాద్ పిచ్ పై పరుగుల వరద పారుతుంటుంది. అయితే మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ కు సన్ రైజర్స్ పేసర్ భువనేశ్వర్ తొలి ఓవర్లోనే షాక్ ఇచ్చాడు. ఓపెనర్ సాహాను డకౌట్ గా పెవివియన్ కు పంపాడు.

తర్వాత శుభ్ మన్ గిల్, సాయిసుదర్శన్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ధాటిగా ఆడుతూ రెండో వికెట్ కు 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తన సూపర్ ఫామ్ కొనసాగించిన గిల్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 58 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ తో 101 పరుగులు చేశాడు. సాయిసుదర్శన్ 47 పరుగులకు ఔటయ్యాడు. అయితే చివర్లో సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఒకదశలో 220కి పైగా స్కోర్ చేస్తుందనుకున్న గుజరాత్ జోరుకు బ్రేక్ వేశారు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ అదరగొట్టాడు. చివరి ఓవర్లో 4 వికెట్లు పడగొట్టాడు. హిట్టింగ్ చేస్తారనుకున్న తెవాటియా, మిల్లర్ , హర్థిక్ లు విఫలమవడంతో గుజరాత్ 188 పరుగులకే పరిమితమైంది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ 4 ఓవర్లలో 30 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు.

ఛేజింగ్ లో సన్ రైజర్స్ ఆరంభం నుంచే తడబడింది. ప్రధాన బ్యాటర్లలో ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేకపోయారు. అన్మోల్ ప్రీత్ సింగ్ 5 , అభిషేక్ శర్మ 4 , రాహుల్ త్రిపాఠి 1 , కెప్టెన్ మర్క్ క్రమ్ 10, సన్వీర్ సింగ్ 7 , అబ్దుల్ సమద్ 4 పరుగులకే ఔటయ్యారు. సన్ రైజర్స్ కేవలం 59 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ హైదరాబాద్ ను ఆదుకున్నాడు. భువనేశ్వర్ తో కలిసి నిలకడగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అవకాశం చిక్కినప్పుడల్లా భారీ షాట్లు కొడుతూ సాధించాల్సిన రన్ రేట్ మరీ పెరిగిపోకుండా చూశాడు.

ఈ క్రమంలో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అటు భువనేశ్వర్ కూడా చక్కని సపోర్ట్ ఇవ్వడంతో మ్యాచ్ కాస్త ఆసక్తికరంగానే కనిపించింది. క్లాసెన్ , భువనేశ్ర్ ఎనిమిదో వికెట్ కు 68 పరుగులు జోడించారు. క్లాసెన్ 44 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసి ఔటవడంతో సన్ రైజర్స్ ఓటమి ఖాయమైంది.చివరికి ఆ జట్టు 9 వికెట్లకు 154 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో షమి 4 , మోహిత్ శర్మ 4 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మరోవైపు సీజన్ లో 8వ ఓటమిని చవిచూసిన సన్ రైజర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.