Shubman Gill: బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చోటు కల్పించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. అయితే సిరీస్ మధ్యలో గాయం కారణంగా ఆయన జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ యజమాని గిల్ వరల్డ్ కప్ జట్టులో లేకపోవడంపై స్పందించారు.
గుజరాత్ టైటాన్స్ ‘జూనియర్ టైటాన్స్’ ప్రోగ్రామ్ మూడవ దశ లాంచ్ సందర్భంగా జరిగిన వర్చువల్ సంభాషణలో సీఈఓ కల్నల్ అరవిందర్ సింగ్ మాట్లాడుతూ.. “ఏ క్రీడాకారుడి (గిల్‌ను ఉద్దేశించి) జీవితంలోనైనా ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులు సహజం. ఆయన తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశారు. సెలెక్టర్ల నిర్ణయాన్ని ఆయన గౌరవిస్తారు. ఆయన గురించి నాకు తెలిసినంత వరకు ఆయన మరింత బలంగా తిరిగి వస్తారని మాత్రమే నేను చెప్పగలను. ఇటీవలి రెండు మ్యాచ్‌ల్లో మీరు చూసినట్లుగానే ఆయన మునుపటి కంటే మెరుగ్గా రాణిస్తారు” అని అన్నారు.
Also Read: సంక్రాంతి విన్నర్ ‘మన శంకరవరప్రసాదే’
అరవిందర్ సింగ్ ఇంకా మాట్లాడుతూ.. “ఒక క్రికెటర్‌గా ఆయన సామర్థ్యంపై ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. ఆయన మానసిక బలం చాలా ఎక్కువ. వ్యక్తిగతంగా నేను చెప్పగలిగేది ఏమిటంటే మానసికంగా ఆయన చాలా దృఢమైన వ్యక్తి. ఆయన ప్రతిభ, నైపుణ్యం విషయానికి వస్తే శుభ్‌మన్ ఎంతటి ప్రతిభావంతుడో ఆయన మన జట్టు కోసం, దేశం కోసం ఏం చేశాడో ప్రపంచం మొత్తానికి తెలుసు” అని పేర్కొన్నారు.
సాయి సుదర్శన్ గాయంపై ప్రకటన
సాయి సుదర్శన్ గాయం గురించి అరవిందర్ సింగ్ మాట్లాడుతూ.. “సాయి త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడు. ఇది అంత తీవ్రమైన గాయం ఏమీ కాదు. వైద్య భాషలో దీనిని ‘ఎబ్రేషన్’ అంటారు. ఇది ఫ్రాక్చర్ కాదు” అని స్పష్టం చేశారు. సాయి సుదర్శన్ ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌ల్లో ఆడలేదు. డిసెంబర్ 29న బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్ట్ చేశారు.
