IPL Champs: గుజరాత్ టైటాన్స్ దే ఐపీఎల్ టైటిల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15 వ సీజన్ లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ గా నిలిచింది. లీగ్ లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్ లోనే టైటిల్ ఎగరేసుకుపోయింది.

  • Written By:
  • Updated On - May 30, 2022 / 09:36 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15 వ సీజన్ లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ గా నిలిచింది. లీగ్ లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్ లోనే టైటిల్ ఎగరేసుకుపోయింది. సీజన్ ఆరంభం నుంచీ నిలకడగా విజయాలు సాధిస్తూ లీగ్ స్టేజ్ ను టాప్ ప్లేస్ లో ముగించిన హార్థిక్ సేన తుది పోరులోనూ అదరగొట్టింది. అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణించి రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. దీంతో రెండోసారి టైటిల్ గెలిచి దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కు ఘన నివాళి ఇవ్వాలనుకున్న రాయల్స్ కల నెరవేరలేదు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారు. ధాటిగా ఆడడంలో ఇబ్బంది పడిన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 22 రన్స్‌ చేసి ఔటయ్యాడు. ఇక్కడ నుంచి రాజస్థాన్ రాయల్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.
ఈ సీజన్ లో పెద్దగా రాణించని కెప్టెన్‌ సంజు శాంసన్‌ ఫైనల్లో కూడా నిరాశ పరిచాడు. సంజూ శాంసన్ 11 రన్స్ కే ఔటవగా… దేవ్‌దత్‌ పడిక్కల్‌ 10 బాల్స్‌ ఆడి కేవలం 2 రన్స్‌ కే వెనుదిరిగాడు. టోర్నీ మొత్తం టాప్‌ ఫామ్‌లో ఉన్న బట్లర్‌ ఓవైపు అడపాదడపా బౌండరీలు బాదినా.. స్కోరుబోర్డు వేగంగా ముందుకు కదల్లేదు. స్కోరు పెంచే క్రమంలో బట్లర్ 39 రన్స్ కు ఔటవడంతో రాజస్థాన్ పతనం కొనసాగింది. కాసేపటికే హెట్‌మయర్‌ 11 , అశ్విన్ 6 రన్స్ కే ఔటయారు. అంచనాలు పెట్టుకున్న రియాన్ పరాగ్ చివరి వరకూ క్రీజులో ఉన్నప్పటికీ భారీ షాట్లు ఆడలేక పోయాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా బంతితో అదరగొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 17 రన్స్‌ ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీశాడు. అందులో జోస్‌ బట్లర్‌ వికెట్ కూడా ఉంది. దీంతో పాటు సరైన టైమ్ లో బౌలింగ్ మార్పులు చేస్తూ రాజస్థాన్‌ రాయల్స్‌ను 130 పరుగులకే కట్టడి చేయడంలో పాండ్య పూర్తిగా సక్సెస్ అయ్యాడు. రషీద్‌ 4 ఓవర్లలో 18 రన్స్‌ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీయాగా…సాయి కిషోర్ 2 వికెట్లు తీసుకున్నాడు.

Hardik Pandya

131 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ కూడా తడబడింది. 23 పరుగులకు ఓపెనర్లు వికెట్లు చేజార్చుకుంది. సాహా 5 , వేడ్ 8 రన్స్ కే ఔటయ్యారు. దీంతో తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్య , గిల్ ఆచితూచి ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 63 పరుగులు జోడించారు. పాండ్య 30 బంతుల్లో 3 ఫోర్లు , 1 సిక్సర్ తో 34 పరుగులకు ఔటయ్యాడు. అయితే గిల్ , ఫామ్ లో ఉన్న డేవిడ్ మిల్లర్ గుజరాత్ విజయాన్ని పూర్తి చేశారు. మధ్య ఓవర్లలో రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేసేందుకు పోరాడినా భారీ లక్ష్యం కాకపోవడంతో గుజరాత్ ఒత్తిడికి లోనూ కాలేదు. మిల్లర్ మెరుపులతో గుజరాత్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ చేదించింది. మిల్లర్ 32 , గిల్ 45 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. ఈ సీజన్ లో రాజస్థాన్ తో ఆడిన అన్ని సార్లూ గుజరాత్ దే పై చేయిగా నిలిచింది.
ఇదిలా ఉంటే అరంగేట్రం చేసిన తొలి సీజన్ లోనే టైటిల్ గెలిచి గుజరాత్ రికార్డులకెక్కింది.