Site icon HashtagU Telugu

LSG vs GT: లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో గుజరాత్ విక్టరీ.. గెలుపు ముంగిట బోల్తా పడిన లక్నో

Gt

Gt

LSG vs GT: టీ ట్వంటీ ఫార్మాట్‌లో ఏదైనా జరగొచ్చు..250 స్కోర్ కొట్టినా గెలుపుపై ధీమాగా ఉండలేని పరిస్థితి.. ఒక్కోసారి 130 కొట్టినా కూడా కాపాడుకోవచ్చు.. ఐపీఎల్‌ లీగ్ స్టేజ్‌లో మొన్నటి వరకూ హైస్కోరింగ్ ఫైట్స్ అలరిస్తే… గత మూడు రోజులుగా లో స్కోరింగ్ మ్యాచ్‌లు పెద్ద జట్లకు షాకిస్తున్నాయి. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ 135 పరుగుల స్కోరును కాపాడుకుంది. గెలుపు ఆశలు లేని స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని లక్నో సూపర్ జెయింట్స్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 17వ ఓవర్ వరకూ విజయం దిశగా సాగిన లక్నో అనూహ్యంగా కుప్పకూలింది. ఆ జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్ డిఫెన్సివ్ బ్యాటింగ్‌తో ఓటమికి కారణమయ్యాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌కు రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డకౌటయ్యాడు. అయితే వృద్ధిమాన్ సాహా, హార్థిక్ పాండ్యా రాణించడంతో కోలుకుంది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. కీలక పార్టనర్‌షిప్ నెలకొల్పినా ఇద్దరూ భారీ షాట్లు ఆడలేదు. పిచ్‌ స్లోగా ఉండడంతో సింగిల్స్‌, అప్పుడప్పుడూ ఫోర్లు కొడుతూ స్కోర్ నడిపించారు. సాహా 47 రన్స్‌కు ఔటవగా… కాసేపటికే అభినవ్ మనోహర్, విజయ్ శంకర్‌ ఔటవడంతో గుజరాత్ వరుస వికెట్లు కోల్పోయింది. మరోవైపు చివరి ఓవర్లలో కెప్టెన్ హార్థిక్ పాండ్యా భారీ షాట్లతో అలరించాడు. 50 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 2 , స్టోయినిస్ 2 వికెట్లు పడగొట్టారు.
లక్ష్యం చిన్నదే కావడంతో లక్నో విజయం ఖాయమని అంతా భావించారు. దానికి తగ్గట్టుగానే ఓపెనర్లు కైల్ మేయర్స్ , కెఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 6.3 ఓవర్లలోనే 55 పరుగులు జోడించారు. మేయర్స్ 24 పరుగులకు ఔటైనప్పటకీ.. రాహుల్, కృనాల్ లక్నో ఇన్నింగ్స్ నడిపించారు. సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా లేకపోవడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడారు. ఈ క్రమంలో కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 15వ ఓవర్ నుంచీ గుజరాత్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. కృనాల్‌తో పాటు కీలక బ్యాటర్ నికోలస్ పూరన్‌ను ఔట్ చేసి ఒత్తిడి పెంచారు.

విజయం కోసం చివరి ఓవర్‌లో 12 పరుగులు చేయాల్సి ఉండగా మొహిత్ శర్మ అద్భుతమే చేశాడు. వరుసగా కెఎల్ రాహుల్, స్టోయినిస్‌లను ఔట్ చేశాడు. దీంతో ఒత్తిడికి లోనైన లక్నో మరో రెండు వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. చివరికి సునాయాసంగా గెలుస్తుందనుకున్న లక్నో గెలుపు ముంగిట బోల్తా పడింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 128 పరుగులే చేయగలిగింది. ఒక దశలో కెఎల్ రాహుల్ మరీ డిఫెన్సివ్‌గా ఆడడం కొంపముంచింది. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్, మొహిత్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్‌లో లక్నోకు ఇది మూడో ఓటమి కాగా గుజరాత్ టైటాన్స్‌కు నాలుగో విజయం.