IPL 2022 : సన్ రైజర్స్ జోరు కొనసాగేనా ?

ఐపీఎల్‌ 2022 సీజన్‌ లో ఈ రోజు మరో హోరాహోరీ పోరు జరగనుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్.

  • Written By:
  • Publish Date - April 27, 2022 / 04:50 PM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌ లో ఈ రోజు మరో హోరాహోరీ పోరు జరగనుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్.. అలాగే ఈ సీజన్ లో 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో రెండో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఏప్రిల్ 27 బుధవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌ ఫస్టాఫ్ లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టే విజయం సాధించింది. ఈ తరుణంలో ఈ రోజు మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి డబ్బకుదెబ్బ తీయాలని గుజరాత్ టైటాన్స్ జట్టు భావిస్తుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్ లో కేన్ విలియంసన్ సారథ్యంలోని సన్‌రైజర్స్‌ విషయానికొస్తే.. ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్ లో వీర లెవెల్‌లో రెచ్చిపోయిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు ప్రత్యర్ధిని కేవలం 68 పరుగులకే కుప్పకూల్చి రెట్టించిన ఉత్సాహంతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే మరోసారి అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో రాణించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. నేటి మ్యాచ్‌ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒకే ఒక మార్పు చేసే అవకాశం ఉంది. జగదీశ సుచిత్ స్థానంలో గాయం నుంచి కోలుకున్న యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తుదిజట్టులోకి రానున్నాడు. ఇక అబ్దుల్ సమద్ ఈ మ్యాచ్ కూడా రిజర్వ్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. అలాగే హార్దిక్ పాండ్య సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో అదరగొట్టే ప్రదర్శన చేస్తోంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఈ జట్టులో ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా , శుబ్ మాన్ గిల్ ఫామ్ లేమి కలవరపెడుతోంది. వీరిద్దరూ భారీ స్కోర్లు నమోదు చేస్తే ఈ మ్యాచ్ లో కూడా గుజరాత్ జట్టుకు తిరుగుండకపోవచ్చు.