Site icon HashtagU Telugu

GT vs PBKS: ప్లేఆఫ్‌ కోసం పోటీ పడుతున్న పంజాబ్ – గుజరాత్

GT vs PBKS

GT vs PBKS

GT vs PBKS: ఐపీఎల్ 37వ మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ మళ్లీ గెలుపు ట్రాక్‌లోకి రావాలని తహతహలాడుతోంది. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ కూడా తమ మునుపటి మ్యాచ్‌లో ఓడిపోవడంతో పంజాబ్ పై గెలిచి సత్తా చాటాలనుకుంటుంది. ఇరు జట్ల మధ్య ఈ రోజు ఆదివారం ముల్లన్‌పూర్‌లో మ్యాచ్ జరగనుంది.

కాగా అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌తో గుజరాత్‌ టైటాన్స్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని శుభ్‌మన్ గిల్ జట్టు భావిస్తోంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచాయి. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది.

ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ప్రభ్‌సిమ్రన్, జితేష్ శర్మలు రాణించకపోవడంతో జట్టుకు సరైన ఆరంభం లభించడం లేదు. శిఖర్‌ ధావన్‌ గాయం తర్వాత జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. చివరి మ్యాచ్‌లో సామ్ కుర్రాన్ ఓపెనర్‌కు వచ్చాడు. అయినా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్‌ను సజీవంగా ఉంచడంలో అశుతోష్ శర్మ మరియు శశాంక్ సింగ్ కీలక పాత్ర పోషించారు . గుజరాత్ టైటాన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆశించిన స్థాయిలో ఆడకపోవడం జట్టు విజయ అవకాశాలను కోల్పోతుంది. ఈ సీజన్‌లో గిల్ కేవలం ఒకే ఒక్క అర్ధ సెంచరీ చేయగలిగాడు. అయితే సాయి సుదర్శన్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. కేన్ విలియమ్సన్ కూడా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. గాయపడిన డేవిడ్ మిల్లర్ తిరిగి వచ్చిన తర్వాత కూడా గుజరాత్ గత మ్యాచ్‌లో 89 పరుగులకు ఆలౌట్ అయింది.

We’re now on WhatsAppClick to Join

ముల్లన్‌పూర్ పిచ్‌పై ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడ ఏ మ్యాచ్‌లోనూ అత్యధిక స్కోరింగ్‌ నమోదు కాలేదు. ఈ మైదానంలో గరిష్టంగా 192 పరుగులు నమోదయ్యాయి. నాలుగు మ్యాచ్‌ల 8 ఇన్నింగ్స్‌ల సగటు స్కోరు 173 పరుగులు. ముల్లన్‌పూర్‌ పిచ్‌ ఫాస్ట్‌ బౌలర్లకు సహకరిస్తోంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయానికి వర్షం కురిసే అవకాశం లేదు. ఇక్కడ నాలుగు మ్యాచ్‌లలో రెండు మ్యాచ్ లు లక్ష్యాలను ఛేదించి, రెండు మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది.

పాయింట్ల పట్టికను పరిశీలిస్తే రెండు జట్లూ అట్టడుగున ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండింట్లో మాత్రమే గెలిచి 9వ స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్‌లు ఆడి మూడు మ్యాచ్‌లు గెలిచి 8వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఇరు జట్లు అద్భుతం చేయాల్సిందే.

Also Read: CM Jagan Attack: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం.. దుర్గారావు విడుదల

Exit mobile version