IPL 2022 : రషీద్ ఖాన్ గొప్ప బౌలరేం కాదు : లారా

ఐపీఎల్‌ 2022 సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు, గుజ‌రాత్ టైటాన్స్ స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మెగా టోర్నీలో రషీద్ ఖాన్ 100 వికెట్ల ఘనతను అందుకున్నాడు .

  • Written By:
  • Publish Date - April 27, 2022 / 04:51 PM IST

ఐపీఎల్‌ 2022 సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు, గుజ‌రాత్ టైటాన్స్ స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మెగా టోర్నీలో రషీద్ ఖాన్ 100 వికెట్ల ఘనతను అందుకున్నాడు . అతి త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో అంటే 83 ఇన్నింగ్స్‌ల్లో 100 వికెట్లు తీసిన మూడో బౌల‌ర్‌గా రషీద్ ఖాన్ రికార్డు సాధించాడు. ఇటీవల కేకేఆర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన ర‌షీద్ ఖాన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.. అయితే తాజాగా రషీద్ ఖాన్‌ను ఉద్దేశించి ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్ కోచ్‌ బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

2017 నుంచి 2021 ఐపీఎల్‌ సీజన్‌ వరకు ఎస్‌ఆర్‌హెచ్‌లో భాగమైన రషీద్‌ ఖాన్‌ను ఐపీఎల్ 2022 ముంగిట హైదరాబాద్ ఫ్రాంచైజీ వదిలేసింది. సన్‌రైజర్స్‌ తరఫున రషీద్ 76మ్యాచ్‌లలో 93వికెట్లు పడగొట్టాడు. అయితే తాజాగా రషీద్ ఖాన్ పై బ్రియాన్ లారా మాట్లాడుతూ.. రషీద్‌ఖాన్ జట్టులో లేకున్నా సన్‌రైజర్స్ జట్టు అద్భుతంగా రాణిస్తుందని పేర్కొన్నాడు. రషీద్ ఖాన్‌ మంచి బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అతను సన్‌రైజర్స్ జట్టులో లేకున్నా కూడా మా జట్టు సమతూకంగానే ఉంది. నిజానికి రషీద్ ఖాన్ బౌలింగ్ లో బ్యాటర్లు ఎక్కువగా డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ అతను వరుసగా వికెట్లు పడగోట్టే గొప్ప బౌలర్ ఏం కాదు అని లారా పేర్కొన్నాడు.

అలాగే రషీద్ ఖాన్ ఎకానమీ చాలా బాగుంటుంది. కానీ అతనికంటే అత్యుత్తమంగా రాణించగల స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మా జట్టులో ఉన్నాడు. ఇటీవల గాయపడ్డ సుందర్ స్థానంలో సుచిత్ జట్టులోకి వచ్చాడు. అతను కూడా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. ఏదేమైనా రషీద్ ఖాన్ మా జట్టులో లేకున్నా కూడా మేము అద్భుతాలు చేయగలం అని లారా చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు సన్ రైజర్స్ కు మ్యాచ్ విన్నర్ గా ఉన్న రషీద్ ఖాన్ పై లారా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ షాక్ కు గురి చేసింది.