Site icon HashtagU Telugu

Delhi Capitals: ఢిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

89

89

ఐపీఎల్ 15వ సీజన్‌ ప్రారంభానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ ఆటగాళ్ళతో ప్రిపరేషన్ క్యాంపులు మొదలుపెట్టేశాయి. లీగ్‌లో సత్తా చాటేందుకు స్టార్ ప్లేయర్స్ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుండగా.. మరికొందరు ఒక్కొక్కరిగా ముంబైకి చేరుకుంటున్నారు. అయితే కొందరు విదేశీ ప్లేయర్లు ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడంపై సందిగ్ధత కొనసాగుతుండగా… మరికొందరు ప్లేయర్స్ ఫిట్‌నెస్ , గాయాలు ఫ్రాంచైజీలను టెన్షన్ పెడుతున్నాయి.

అయితే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ బిగ్ రిలీఫ్ దక్కింది. ఫిట్‌నెస్ సమస్యలతో ఈ సీజన్‌లో ఆడే అవకాశాలు లేవనుకున్న సౌతాఫ్రికా స్టార్ పేసర్ నోర్జే ఆశ్చర్యకరంగా ముంబైకి చేరుకున్నాడు. దాదాపు ఐదు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన నోర్జే ఈ సీజన్ ఆడడం కష్టమేనని గతంలో వార్తలు వచ్చాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అతనికి రీప్లేస్‌మెంట్ కోసం అన్వేషిస్తోంది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా నోర్జే ముంబైకి చేరుకోవడం ఆశ్చర్యపరిచింది.అయితే నోర్జే ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడతాడా లేదా అనేది సందిగ్ధత కొనసాగుతోంది. అతని ఫిట్‌నెస్ , గాయంపై ఢిల్లీ క్యాపిటల్స్ మెడికల్ టీమ్ పర్యవేక్షించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

గత ఏడాది నవంబర్ నుంచీ మైదానానికి దూరమైన నోర్జే ఎంతవరకూ జట్టుకు ఉపయోగపడతాడనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నోర్జే ఫిట్‌నెస్ సాధించినప్పటకీ.. ఆరంభ మ్యాచ్‌లకు అతన్ని తీసుకునే అవకాశం లేదని సమాచారం. ఆటగాళ్ళ ఫిట్‌నెస్‌ విషయంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు సమాచారమిచ్చిన తర్వాత లీగ్‌లో ఆడించే అవకాశముందని ఢిల్లీ క్యాపిటల్స్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలువురు సౌతాఫ్రికా క్రికెటర్లు బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కంటే ఐపీఎల్ ఆడేందుకే మొగ్గుచూపడం సఫారీ క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సెలక్టర్లు ఆటగాళ్ళ నిర్ణయాన్ని తప్పుపడుతుండగా.. సఫారీ క్రికెట్ బోర్డు మాత్రం ఆటగాళ్ళకే నిర్ణయాన్ని వదిలేసింది.

నోర్జేను ఢిల్లీ క్యాపిటల్స్ 6.5 కోట్లకు రిటైన్ చేసుకోగా… ఆ జట్టు పేస్ ఎటాక్‌ను అతనే లీడ్ చేయాల్సి ఉంది. గత సీజన్‌లో ఈ సఫారీ పేసర్ ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. పవర్ ప్లేతో పాటు చివరి ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు. ఈ కారణంగానే ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్, అక్షర్ పటేల్‌, పృథ్వీ షాలతో పాటు నోర్జేను రిటైన్ చేసుకుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.