Umran Malik: నా టార్గెట్ ఆ రికార్డు కాదు : ఉమ్రాన్ మాలిక్

ఐపీఎల్‌ 2022 వ సీజన్ లో తన స్పీడ్ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్లకు ఉమ్రాన్ మాలిక్ వణుకు పుట్టించాడు.

  • Written By:
  • Updated On - June 6, 2022 / 12:20 PM IST

ఐపీఎల్‌ 2022 వ సీజన్ లో తన స్పీడ్ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్లకు ఉమ్రాన్ మాలిక్ వణుకు పుట్టించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన ఉమ్రాన్‌ మాలిక్‌.. గంటకు నిలకడగా 150 కి.మీ. వేగంతో బౌలింగ్‌ చేసి మాజీ క్రికెటర్లతోపాటు సెలక్టర్లనూ ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు వరకూ 157 కి.మీ. వేగంతో ఫాస్టెస్ట్‌ బాల్‌ అతనిదే. దీంతో సఫారీ టీమ్ తో టీ ట్వంటీ సీరీస్ కి ఎంపికయిన ఉమ్రాన్ పై ఇప్పుడు అంచనాలు పెరిగాయి. వరల్డ్ క్రికెట్‌లో షోయబ్‌ అక్తర్‌ వేసిన ఫాస్టెస్ట్‌ బాల్‌ రికార్డును కూడా అతను అధిగమిస్తాడా అని చర్చ మొదలయింది. అక్తర్‌ 2003 వరల్డ్‌కప్‌లో గంటకు 161.3 కి.మీ. వేగంతో ఫాస్టెస్ట్‌ బాల్‌ వేశాడు. ఆ బాల్‌ వేసిన అక్తరే తాజాగా ఉమ్రాన్‌ తన రికార్డును బ్రేక్‌ చేస్తాడనీ అన్నాడు. అయితే ఈ యువ పేసర్‌ మాత్రం ప్రస్తుతం ఆ స్పీడు తన టార్గెట్‌ కాదని, భారత్ కు విజయం అందించడమే లక్ష్యమని చెప్పాడు.

ప్రస్తుతం నా దృష్టి ఆ రికార్డుపై లేదు. సరిగ్గా బౌలింగ్‌ చేయడం, సరైన ప్రదేశాల్లో బౌలింగ్‌ చేయడం ద్వారా సౌతాఫ్రికాపై నా టీమ్‌కు ఐదు మ్యాచ్‌లలోనూ విజయం సాధించిపెట్టడమే నా లక్ష్యం. అయితే గంటకు 150 కి.మీ అంతకంటే ఎక్కువ వేగంతో మాత్రం బౌలింగ్‌ చేస్తానని ఉమ్రాన్‌ స్పష్టం చేశాడు. ఇక తాను ఈ వేగంతో బౌలింగ్ చేయడానికి తన సహచరుడు అబ్దుల్ సమద్‌ కీలకపాత్ర పోషించినట్లు ఉమ్రాన్‌ చెప్పాడు.
అబ్దుల్‌ తనను ఎంతగానో ప్రోత్సహించాడనీ, తానెప్పుడు అతనికి బౌలింగ్‌ చేసినా సరే స్లోగా వేస్తున్నానని చెప్పేవాడనీ., అప్పుడు తాను మరింత వేగంతో బౌలింగ్‌ చేసేవాడిననీ గుర్తు చేసుకున్నాడు.కాగా జిమ్‌, సరైన ఎక్సర్‌సైజులు తన స్పీడుకు మరింత సహకరించాయని ఉమ్రాన్‌ తెలిపాడు. అబ్దుల్‌ సమద్‌ జమ్ముకశ్మీర్‌ టీమ్‌తోపాటు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లోనూ ఉమ్రాన్‌కు సహచరుడు. చిన్నతనం నుంచే ఇద్దరూ కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్నారు.