Site icon HashtagU Telugu

IND vs AUS 3rd T20: మాక్స్ వెల్ మెరుపు సెంచరీ.. మూడో టీ ట్వంటీలో ఆసీస్ విజయం

India vs Australia

IND vs AUS 3rd T20

IND vs AUS 3rd T20: భారత్ , ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన ఆసీస్ మూడో టీ ట్వంటీలో గెలిచి సిరీస్ ఆశలు నిలుపుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మాక్స్ వెల్ మెరుపు సెంచరీతో ఆసీస్ ను గెలిపించాడు.

మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్‌కు ఈ సారి సరైన ఆరంభం దక్కలేదు. యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్ నిరాశపరిచారు. అయితే మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారీ షాట్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒక ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ సపోర్ట్ ఇవ్వడంతో చెలరేగిన రుతురాజ్‌ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సూర్యకుమార్, రుతురాజ్ మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించగా… సూర్యకుమార్ 39 పరుగులకు ఔటయ్యాడు. తర్వాత తిలక్‌వర్మతో కలిసి జోరు కొనసాగించిన రుతురాజ్ గైక్వాడ్ కేవలం 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 17 ఓవర్లు ముగిసేసరికి 71 పరుగులతో క్రీజులో ఉన్న రుతురాజ్ 18వ ఓవర్‌లో ఆసీస్ బౌలర్ హార్డీని ఉతికారేశాడు. ఆ ఓవర్లో ఏకంగా 24 రన్స్ పిండుకున్నాడు. అటు తిలక్ వర్మ కూడా దూకుడుగా ఆడడంతో భారత్ అనుకున్న దానికంటే భారీస్కోరే చేసింది. రుతురాజ్ 57 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్లతో 123 పరుగులతో నాటౌట్ గా నిలిస్తే…తిలక్ వర్మ 31 రన్స్ చేశారు. మొత్తం మీద రుతురాజ్ మెరుపులతో భారత్ 20 ఓవర్లలో 222 పరుగులు చేసింది.

ఛేజింగ్ లో ఆసీస్ కు ఓపెనర్లు హెడ్ , హార్డీ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు కేవలం 4.2 ఓవర్లలోనే 47 పరుగులు జోడించారు. అయితే పవర్ ప్లే చివర్లో పుంజుకున్న భారత బౌలర్లు వరుస వికెట్లు పడగొట్టి పైచేయి సాధించారు. హెడ్ కేవలం 18 బంతుల్లోనే 8 ఫోర్లతో 35 , హార్డీ 16, ఇంగ్లీస్ 10 పరుగులకు వెనుదిరిగారు. తర్వాత మాక్స్ వెల్ తనదైన శైలిలో చెలరేగిపోయాడు. మరోవైపు వికెట్లు పడుతున్నా మాక్స్ వెల్ మాత్రం భారీ సిక్సర్లతో భారత్ ను టెన్షన్ పెట్టాడు. మాక్స్ వెల్ జోరుతో ఆస్ట్రేలియా మళ్ళీ మ్యాచ్ ను గెలిచేలా కనిపించింది. చివరి 3 ఓవర్లలో 49 పరుగులు చేయాల్సి ఉండగా…ప్రసిద్ధ కృష్ణ 6 పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. తర్వాతి ఓవర్లలో మాక్స్ వెల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. చివరి ఓవర్లో విజయం కోసం 21 పరుగులు చేయాల్సి ఉండగా మాక్స్ వెల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా 4 ఫోర్లు, 1 సిక్సర్ తో ఆసీస్ కు విజయాన్నందించాడు. ఈ క్రమంలో మాక్స్ వెల్ శతకం సాధించాడు. కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 104 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో సిరీస్ ఆశలను ఆసీస్ సజీవంగా ఉంచుకుంది. సిరీస్ లో తర్వాతి మ్యాచ్ డిసెంబర్ 1న రాయ్ పూర్ లో జరుగుతుంది.

Also Read: Golden Temple: గోల్డెన్ టెంపుల్ లో చోరీ.. కౌంటర్ నుంచి లక్ష మాయం

Exit mobile version