Ind Vs NZ 3rd T20: సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌లో భారత్ భారీస్కోర్ సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ విశ్వరూపం చూపించాడు. బ్యాట్‌తో కివీస్ బౌలర్లపై నిర్థాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ రెండో ఓవర్లోనే ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది. మరోసారి అవకాశాన్ని వృథా చేసుకున్న ఇషాన్ కిషన్ 1 పరుగుకే ఔటయ్యాడు. తర్వాత శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠీ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. వన్‌డౌన్ బ్యాటర్ త్రిపాఠీ 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. తర్వాత సూర్యకుమార్‌యాదవ్, పాండ్యా సహకారంతో గిల్ మరింతగా రెచ్చిపోయాడు. స్టేడియం నలువైపులా మెరుపు షాట్లు ఆడాడు. సూర్యకుమార్‌తో కలిసి 38 రన్స్ , పాండ్యాతో కలిసి 103 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పాడు. పాండ్యాతో కలిసి 103 రన్స్‌ను గిల్ 6.4 ఓవర్లలోనే సాధించాడంటే ఏ రేంజ్‌లో ఆడాడో అర్థం చేసుకోవచ్చు.
కివీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన గిల్ కేవలం 54 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ ట్వంటీల్లో అతనికిదే తొలి శతకం. కాగా అన్ని ఫార్మాట్లలోనూ శతకాలు సాధించిన ఐదో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో సురేశ్ రైనా, రోహిత్‌శర్మ , కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మాత్రమే అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఆటగాళ్ళు. ఇప్పుడు గిల్ కూడా వీరి సరసన చేరాడు. శతకం తర్వాత మరింతగా రెచ్చిపోయిన గిల్ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. పాండ్యా కూడా ధాటిగా ఆడి 17 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 63 బంతుల్లో 126 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గిల్ సెంచరీ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 7 సిక్సర్లున్నాయి. ఓవరాల్‌గా కివీస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.