David Warner : టీ20 ప్రపంచకప్ 2024తో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం ముగిసింది. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి వార్నర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల ఓ సందర్భంలో వార్నర్ మాట్లాడుతూ.. క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) గనుక అనుమతి ఇస్తే వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫి 2025 ఆడతానంటూ తన మనసులోని మాట బయటపెట్టాడు. దీంతో వార్నర్ రీ ఎంట్రీ ఇస్తాడని అతడి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే.. క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్‌కు షాకిచ్చింది.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వార్నర్ రిటైర్ అయినట్లుగా భావిస్తున్నామని, అతడిని ఛాంపియన్స్ ట్రోఫీకి పరిగణలోకి తీసుకోమని ఆస్ట్రేలియా చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ (George Bailey) చెప్పాడు. డేవిడ్ వార్నర్ అద్భుత ఆటగాడని బెయిలీ కితాబిచ్చాడు. ఆసీస్ తరుపున మూడు ఫార్మాట్లలో అతడు చక్కగా రాణించాడన్నాడు. అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడని, అందుకనే అతడిని పాక్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పరిగణలోకి తీసుకోవడం లేదన్నాడు. ఎంతో మంది ప్రతిభావంతమైన యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారన్నాడు.
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. ఈ జట్టులో వార్నర్ సభ్యుడిగా ఉన్నాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం వార్నర్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. 2024 జనవరిలో స్వదేశంలో పాకిస్తాన్‌తో టెస్టు మ్యాచ్ ఆడి సుదీర్ఘ పార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్ 8 దశలోనే ఆస్ట్రేలియా ప్రయాణం ముగిసింది. టీమ్ఇండియా చేతిలో ఓడిపోవడంతో ఆసీస్ సెమీస్ చేరకుండానే నిష్ర్కమించింది. ఈ మ్యాచ్ అనంతరం వార్నర్ టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
Also Read: BCCI: బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న క్రికెటర్, బీసీసీఐ భారీ సాయం
2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన వార్నర్.. తన సుదీర్ఘ కెరీర్‌లో 112 టెస్టులు, 161 వన్డేలు, 110 టీ20 మ్యాచులు ఆడాడు. 112 టెస్టుల్లో 44.6 సగటుతో 8786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 161 వన్డేల్లో 45.3 సగటుతో 6932 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు, 33 అర్థశతకాలు ఉన్నాయి. 110 టీ20ల్లో 33.4 సగటుతో 3277 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 28 అర్థశతకాలు ఉన్నాయి.