Gautam Gambhir: భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రయాణం ఎత్తుపల్లాలతో సాగుతోంది. వన్డే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో గంభీర్ నాయకత్వంలో జట్టు ఆకట్టుకున్నప్పటికీ టెస్టుల్లో మాత్రం టీమ్ ఇండియా ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-2తో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి తర్వాత గంభీర్‌ను టెస్ట్ కోచ్ పదవి నుంచి తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బీసీసీఐ కొత్త టెస్ట్ కోచ్ కోసం అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
గంభీర్ భవిష్యత్తుపై సందిగ్ధత
గౌతమ్ గంభీర్ 2027 వరకు టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఒప్పందం కలిగి ఉన్నారు. అయితే టెస్ట్ క్రికెట్‌లో జట్టును నడిపించడానికి గంభీర్ సరైన వ్యక్తి అవునా కాదా అనే సందేహం బీసీసీఐలో మొదలైందని పిటిఐ (PTI) నివేదిక పేర్కొంది. దక్షిణాఫ్రికా పర్యటనలో వైఫల్యం తర్వాత టెస్ట్ జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టాల్సిందిగా బోర్డు మరోసారి వీవీఎస్ లక్ష్మణ్‌ను అనధికారికంగా సంప్రదించినట్లు తెలుస్తోంది.
Also Read: మరో అడ్వెంచర్ కు సిద్దమైన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
గతంలో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసినప్పుడు కూడా లక్ష్మణ్ పేరు వినిపించింది. అయితే లక్ష్మణ్ ఈ ప్రతిపాదనను మళ్ళీ తిరస్కరించినట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ‘హెడ్ ఆఫ్ క్రికెట్’గా కొనసాగడానికే మొగ్గు చూపుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు గంభీర్‌కు కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ బీసీసీఐ కొత్త కోచ్ కోసం ప్రయత్నించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
డబ్ల్యూటీసీ (WTC) పాయింట్ల పట్టికలో భారత్ దయనీయ స్థితి
మొదటి రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్స్‌లో భారత్ అద్భుతంగా రాణించి ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత 2025 WTC ఫైనల్‌కు భారత్ క్వాలిఫై కాలేకపోయింది. ప్రస్తుతం 2025-27 WTC సైకిల్‌లో కూడా టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. భారత్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం 4 మాత్రమే గెలిచింది. 4 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వగా.. ఒక మ్యాచ్ డ్రా అయింది. పాయింట్ల శాతం (PCT) పరంగా చూస్తే ఇతర జట్లు భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి.
