భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో సౌరవ్ గంగూలీ శకం ముగిసింది. తాజా పరిణామాల నేపథ్యంలో దాదా బీసీసీఐ నుంచి వెళ్లిపోవడం ఖాయమైంది. గత కొంత కాలంగా వచ్చిన వార్తలు పూర్తిగా తలకిందులు అవుతూ దాదా ఐసీసీ ప్రెసిడెంట్ రేసులో కూడా నిలబడే అవకాశాలు లేవనే చెప్పాలి. 83 ప్రపంచకప్ హీరో రోజర్ బిన్నీ దాదా స్థానంలో బీసీసీఐ పగ్గాలు అందుకోనున్నారు. తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవనున్నాడు. మరో వ్యక్తి అధ్యక్ష పదవికి పోటీలో లేకపోవడంతో బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా రెండో సారి కార్యదర్శిగా కొనసాగనున్నాడు.
ఐసీసీ బోర్డులో బీసీసీఐ ప్రతినిధిగా కూడా గంగూలీ కొనసాగే అవకాశం కనిపించడం లేదు. జై షా ఆ స్థానాన్ని భర్తీ చేయొచ్చని సమాచారం. బోర్డు అధ్యక్షుడిగా మరోసారి కొనసాగేందుకు గంగూలీ ఆసక్తి కనబరిచినా బోర్డు అంగీకరించలేదు.అయితే దాదాకు ఐపీఎల్ ఛైర్మన్ పదవిని ఇవ్వజూపగా అతను తిరస్కరించినట్టు తెలుస్తోంది. కొత్త కార్యవర్గంలో దాదాకు చోటు లభించకపోవడం ఆశ్చర్యం కలిగించలేదనీ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. విధుల నిర్వహణలో విఫలమయ్యాడంటూ దిల్లీ సమావేశంలో విమర్శలు వచ్చినప్పుడే బోర్డు అధ్యక్షుడిగా అతడిని కొనసాగించడం కష్టమని స్పష్టమైంది.
ఐసీసీ అధ్యక్ష పదవికి గంగూలీ పేరును ప్రతిపాదిస్తారో లేదో తెలియదన్నాడు.
బోర్డులోని అన్ని పదవులూ ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉండటంతో ఏజీఎంలో ఎన్నికలు జరగకపోవచ్చనీ సమాచారం. బిన్నీ, జై షా, రాజీవ్ శుక్లా సహా వివిధ పదవులకు రేసులో ఉన్నవాళ్లంతా ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు, ప్రస్తుత ట్రెజరర్ అరుణ్‌సింగ్ ధుమాల్ ఐపీఎల్ పగ్గాలు చేపట్టనున్నాడు.గత మూడేళ్లుగా భారత క్రికెట్లో చక్రం తిప్పిన గంగూలీకి ఇది మింగుడు పడని విషయమే. దాదా ఫాన్స్ కూడా ఇది ఊహించలేదు.