Saurav Ganguly: ఇకపై కొత్త ఐపీఎల్ ను చూస్తారు : గంగూలీ

వరల్డ్ క్రికెట్ లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటేనే కోట్లాది రూపాయలకు కేరాఫ్ అడ్రస్.

  • Written By:
  • Publish Date - June 15, 2022 / 05:27 PM IST

వరల్డ్ క్రికెట్ లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటేనే కోట్లాది రూపాయలకు కేరాఫ్ అడ్రస్. తాజాగా ఐపీఎల్ ప్రసార హక్కుల వేలంలో కనీవినీ ఎరగని రీతిలో బీసీసీఐపై కోట్లాభిషేకం కురిసింది. ఎవ్వరూ ఊహించని విధంగా మీడియా రైట్స్ ఏకంగా 48390 కోట్లకు అమ్ముడయ్యాయి.ఈ రికార్డు ధరపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించాడు.ఇక నుంచి ఓ కొత్త ఐపీఎల్‌ను అందిస్తామన్నాడు. స్టేడియాల్లో అభిమానులకు మరింత మెరుగైన అనుభూతి కలిగించడంతోపాటు లీగ్‌ను ఇంకా గొప్పగా నిర్వహిస్తామని దాదా తెలిపాడు. అభిమానులకు మరింత మెరుగైన అనుభూతి కలిగించడానికి వసతులను అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తామన్నాడు.కొత్తగా చాలా స్టేడియాలు వచ్చాయనీ, మరికొన్ని స్టేడియాలను పునరుద్ధరిస్తామన్నాడు వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ను పూర్తి భిన్నంగా, కొత్తగా ఉండేలా చూస్తామని గంగూలీ హామీ ఇచ్చాడు.
గత రెండేళ్లుగా కొవిడ్‌ ఇబ్బంది పెట్టినా.. ఈసారి మాత్రం కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో ఐపీఎల్‌ను చాలా ఘనంగా ముగించినట్లు తెలిపారు. అయితే వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ను మళ్లీ హోమ్‌, అవే ఫార్మాట్‌లోనే నిర్వహించాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది కొవిడ్‌ వల్ల లీగ్‌ మ్యాచ్‌లను ముంబై, పుణెలకే పరిమితం చేయగా.. ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో నిర్వహించారు.ఇదిలా ఉంటే
ఈ ఏడాది టీవీ రేటింగ్స్‌ పడిపోవడంతో మీడియా హక్కులకు భారీ మొత్తం రావడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాము మాత్రం మొదటి నుంచీ ఈ భారీ మొత్తాన్ని ఊహించామని గంగూలీ చెప్పాడు. టీవీ కంటే డిజిటల్‌ హక్కులకు ఎక్కువ మొత్తం రావడం కూడా తమనేమీ ఆశ్చర్యానికి గురి చేయలేదన్నాడు. కాగా వచ్చే అయిదేళ్ల కాలానికీ స్టార్ ఇండియా టీవీ హక్కులు దక్కించుకోగా…వియా కామ్ 18 డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. పెద్ద కార్పొరేట్ సంస్థలు పోటీ పడడంతో ప్రసార హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. రానున్న అయిదు సీజన్లలో మొత్తంగా ఒక్కో మ్యాచ్ ద్వారా బీసీసీఐకి 118 కోట్ల ఆదాయం రానుంది.