India Vs SA: బోణీ కొట్టేది ఎవరో ?

భారత్ , దక్షిణాఫ్రికా టీ ట్వంటీ సీరీస్ కి ఇవాల్టి నుంచే తెరలేవనుంది. అయిదు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా తొలి టీ ట్వంటీ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరుగనుంది.

  • Written By:
  • Publish Date - June 9, 2022 / 01:37 PM IST

భారత్ , దక్షిణాఫ్రికా టీ ట్వంటీ సీరీస్ కి ఇవాల్టి నుంచే తెరలేవనుంది. అయిదు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా తొలి టీ ట్వంటీ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరుగనుంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ కు జట్టును సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.
సొంత గడ్డపై టీమ్ ఇండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుండగా…ఐపీఎల్ లో సత్తా చాటిన పలువురు యువ ఆటగాళ్ళ పైనే అందరి దృష్టి ఉంది. కెప్టెన్ రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, వంటి ప్లేయర్స్ కు విశ్రాంతిని ఇవ్వడంతో యువ ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే రోహిత్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్ గా ఎంపికైన కే ఎల్ రాహుల్ గాయంతో దూరం కావడంతో రిశబ్ పంత్ జట్టు పగ్గాలు అందుకున్నాడు.కాగా యువ ఆటగాళ్లకు. ఈ సీరీస్ అద్భుత అవకాశమని చెప్పొచ్చు. రుతురాజ్‌ గైక్వాడ్, ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌లో రాణించేందుకు ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కెప్టెన్ రిషబ్ పంత్, టీమిండియాను ఎలా ముందుకు నడిపిస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది.

తొలి టీ ట్వంటీ లో భారత తుది జట్టును పరిశీలిస్తే.. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా… వన్ డౌన్ లో శ్రేయాస్ అయ్యర్, నాలుగో స్థానంలో రిషబ్ పంత్ , ఐదో స్థానంలో దినేష్ కార్తీక్ బ్యాటింగ్ కు రానున్నారు, అలాగే ఆల్ రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చోటు దక్కే అవకాశం ఉంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా యుజ్వేంద్ర చాహల్ కు చోటు ఖాయం. అయితే ఈ మ్యాచ్ లో పేస్ బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్ లకు చోటు దక్కనుంది.
మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు కూడా బలంగానే కనిపిస్తుంది. ఐపీఎల్ ఆడడం ద్వారా పలువురు సఫారీ క్రికెటర్లు ఇక్కడి పిచ్ లపై బాగా అలవాటు పడ్డారు. పైగా మిల్లర్ , డికాక్ , మకరమ్, రబడా వంటి ప్లేయర్స్ మంచి ఫామ్ లో ఉండడం కూడా సఫారీ టీమ్ కి అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. ఇక మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న ఫిరోజ్ షా కోట్లా స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. మ్యాచ్ సాగే కొద్దీ మంచు ప్రభావం ఉండే నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు చేజింగ్ కే మొగ్గు చూపొచ్చు.