Site icon HashtagU Telugu

Kashmir Willow Cricket Bat: క‌శ్మీర్ విల్లో క్రికెట్‌ బ్యాట్ల‌కు ఫుల్ క్రేజ్‌.. ఒక్కో బ్యాట్ ధ‌ర ఎంతో తెలుసా?

Kashmir Willow Bats

Kashmir Willow Bats

భార‌త్‌లో ఈ ఏడాది చివ‌రిలో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో క‌శ్మీర్ విల్లో క్రికెట్‌ బ్యాట్ (Kashmir Willow Cricket Bat) ల‌కు య‌మ క్రేజ్ వ‌చ్చేసింది. ఈ బ్యాట్ల‌ను ఎక్కువ‌గా వినియోగించాల‌ని బీసీసీఐ (BCCI) భావిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌ (ODI World Cup) లో కాశ్మీర్ విల్లో బ్యాట్ల‌ను వినియోగించ‌లేదు. ఈ ఏడాది జ‌రిగే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో తొలిసారి వాటిని వినియోగించ‌నున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ‌గా ఇంగ్లీష్ విల్లో బ్యాట్ (English Willow Cricket Bat) ల‌ను వినియోగిస్తుంటారు. అయితే, రానురాను కాశ్మీర్ విల్లో బ్యాట్ల‌కు క్రేజ్ పెరుగుతుండ‌టంతో ప‌లువురు క్రికెట‌ర్లు వీటిని వినియోగించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.

కాశ్మీర్ విల్లో క్రికెట్‌ బ్యాట్ల‌ను వినియోగించేందుకు ప‌లు దేశాల క్రికెట‌ర్లు ఆస‌క్తి చూప‌డానికి ప్ర‌ధాన కార‌ణం కూడా ఉంది. ఆస్ట్రేలియాలో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో కాశ్మీర్ విల్లో బ్యాట్‌ల‌ను వినియోగించారు. ఈ బ్యాట్‌తోనే అత్యంత లాంగ్ సిక్స్ కొట్టారు. దీంతో ఉన్న‌ట్లుండి ఆ బ్యాట్ల‌కు య‌మ క్రేజ్ వ‌చ్చింది. దీంతో అమాంతం డిమాండ్ పెరిగింది. గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో వీటిని వినియోగిస్తున్నారంటే కాశ్మీర్ విల్లో బ్యాట్ల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవ‌చ్చు.

ఇదిలాఉంటే.. ఆఫ్గ‌నిస్థాన్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, యూఏఈ, శ్రీ‌లంక వంటి దేశాలు ఈసారి ప్ర‌పంచ క‌ప్‌లో కాశ్మీర్ విల్లో బ్యాట్ల‌ను ఉప‌యోగించాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. ఈ బ్యాట్ల‌కు డిమాండ్ రావ‌డంతో జ‌మ్మూకాశ్మీర్‌తో పాటు అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహ‌రా, చార్సూ, సేతార్ సంగం, హ‌ల్ములా, సంగం, పుజ్‌టెంగ్‌, మిర్జాపూర్‌, సేతార్ గ్రామాలు, పంజాబ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు ఉపాధి అవ‌కాశాలు పెర‌గ‌నున్నాయి. మ‌రోవైపు ఇంగ్లీష్ విల్లో బ్యాట్ల ధ‌ర‌తో పోలిస్తే కాశ్మీర్ విల్లో బ్యాట్ల ధ‌ర చాలా త‌క్కువ‌. కాశ్మీర్ విల్లో ఒక్కో బ్యాటు రూ.10వేల నుంచి రూ. 20వేల మ‌ధ్య ధ‌ర ఉంటుంది. ఇంగ్లీస్ విల్లో బ్యాట్స్ మాత్రం ల‌క్ష వ‌ర‌కు ఉంటాయి. దీంతో త‌క్కువ ధ‌ర‌కు తోడు నాణ్య‌త‌గా ఉండ‌టంతో క్రికెట‌ర్లు కాశ్మీర్ విల్లో బ్యాట్ల‌ను వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు.