మన దేశంలో అంతర్జాతీయ క్రీడావేదికలపై సత్తా చాటుతున్న వారిలో ఎక్కువ శాతం కింది స్థాయి నుంచి వచ్చినవారే.. మట్టిలో మాణిక్యం పదానికి అసలైన ఉదాహరణగా నిలుస్తుంటారు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా అయినా… ఇప్పుడు కామన్‌వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధిస్తున్న అథ్లెట్లు సాధారణ కుటుంబాల నేపథ్యం నుంచి ఈ స్థాయికి చేరినవారే.
తాజాగా కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన సంకేత్ మహదేవ్ సర్గార్ నేపథ్యం చూస్తే యువక్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. రైతు కుటుంబం నుంచి కామన్‌వెల్త్ గేమ్స్‌లో మెడల్ గెలిచే స్థాయికి చేరుకునేందుకు సంకేత్ చాలానే కష్టపడ్డాడు. బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తర్వాత ఎవరీ సంకేత్ అంటూ క్రీడాభిమానులు తెగ శోధించారు. ఈ సెర్చింగ్‌లో పలు ఆశ్చర్చకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌కు తొలి పతకాన్ని అందించిన సంకేత్ మహదేవ్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు.
సరైన ఉద్యోగం లేక తండ్రికి చెందిన ఓ చిన్న పాన్‌షాప్, ఫుడ్ స్టాల్‌ను నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఓవైపు తనకు ఇష్టమైన వెయిట్ లిఫ్టింగ్‌ను సాధన చేస్తూనే మరోవైపు పాన్ షాప్‌తో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మహరాష్ట్రలోని సంగ్లీకి చెందిన సంకేత్ మహదేవ్.. కిళ్ళీలు కట్టిన చేతులతోనే భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. కామెన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన రజత పతకమే అతని కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన. 2021 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తీవ్రంగా నిరాశపర్చిన సంకేత్ అద్భుతంగా పుంజుకున్నాడు.
స్నాచ్ విభాగంలో అందరికన్నా ఎక్కవు బరువెత్తి అగ్రస్థానంలో నిలిచాడు. 6 కేజీల వ్యత్యాసంతో నిలిచిన మహదేవ్ స్వర్ణపతకం గెలిచేలా కనిపించాడు. కానీ క్లీన్ అండ్ జర్క్‌లో విఫలమవడంతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ టోర్నీ తర్వాత తనకు గుర్తింపు లభిస్తుందని తన పోటీకి ముందు సంకేత్ చెప్పాడంటే అతని ఆత్మవిశ్వాసాన్ని అర్థం చేసుకోవచ్చు. చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ పతకం గెలిచి ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాడు. తాను ఈ పోటీల్లో పతకం గెలిస్తే తగిన గుర్తింపు లభిస్తోందని భావించినట్టు చెప్పాడు. తన తండ్రికి ఆర్థిక భరోసా ఇవ్వడమే లక్ష్యమన్నాడు. తన కెరీర్ కోసం ఎంతో చేసిన ఆయనకు విజయం ద్వారా కృతజ్ఞతలు తెలపడం నా కల అని భావోద్వేగానికి గురయ్యాడు.
పారిస్ 2024 ఒలింపిక్స్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించాడు. దాని కోసం నేను 61 కేజీల విభాగానికి మారుతానని, ఇంకా రెండేళ్ల సమయం ఉంది కాబట్టి ఆ దిశగా సన్నదమవుతానని సంకేత్ వ్యాఖ్యానించాడు. తాజా విజయంతో తనకు నగదు అవార్డులు వచ్చినా.. మరే ఇతర బహుమానం అందినా తన లక్ష్యం మాత్రం మారదని చెప్పుకొచ్చాడు. ఒలింపిక్స్‌లో దేశం తరఫున పతకం సాధించడమే తన ప్రధాన లక్ష్యంగా సంకేత్ మహదేవ్ వివరించాడు. సంకేత్ రజతం గెలిచిన తర్వాత ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురిసింది. ప్రధాని మోదీతో సహా పలువురు సంకేత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పాన్ కట్టిన చేతులతోనే దేశానికి పతకం అందించిన సంకేత్ ఒలింపిక్ లక్ష్యం కూడా నెరవేరాలని ఆకాంక్షించారు.