IND vs SA SERIES : సఫారీలతో సిరీస్ కు దూరమయ్యేది వీరే

ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరువలో ఉంది. ఈ మెగా లీగ్ ముగిసిన వెంటనే భారత జట్టు సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ ల టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో రాణిస్తున్న పలువురు యువ క్రికెటర్లకు సెలక్టర్లు పిలుపునిచ్చే అవకాశాలున్నాయి.

  • Written By:
  • Publish Date - May 10, 2022 / 04:29 PM IST

ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరువలో ఉంది. ఈ మెగా లీగ్ ముగిసిన వెంటనే భారత జట్టు సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ ల టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో రాణిస్తున్న పలువురు యువ క్రికెటర్లకు సెలక్టర్లు పిలుపునిచ్చే అవకాశాలున్నాయి. బిజీ షెడ్యూల్ దృష్ట్యా పలువురు సీనియర్లకు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అయితే యువక్రికెటర్లలో కొందరు గాయాల కారణంగా ఈ సిరీస్ కు దూరం కానున్నారు. వారి గాయాల తీవ్రత , కోలుకునేందుకు పట్టే సమయం వంటి అంశాలపై సరైన స్పష్టత లేదు. సఫారీలతో సిరీస్ కు ముందు ఐపీఎల్ లో గాయపడిన కీలక యువ ఆటగాళ్ళెవరో ఒకసారి చూద్దాం…

1. సూర్యకుమార్ యాదవ్ ః
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కండరాల గాయంతో సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ముంబైకి ఇది పెద్ద దెబ్బ కాకున్నా… సఫారీలతో జరిగే సిరీస్ కు సూర్యకుమార్ ఆడలేకపోతుండడం టీమిండియాకు ఇబ్బందే. ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 8 మ్యాచ్ లలో 43.29 సగటుతో 303 పరుగులు చేయగా… ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ గాయపడ్డాడు. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ అబ్జర్వేషన్ లో ఉన్న సూర్యకుమార్ ఫిట్ నెస్ సాధిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

2. దీపక్ చాహర్ ః
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ కూడా ఆందోళన కలిగించేదే. చెన్నై భారీగా వెచ్చించి వేలంలో కొనుగోలు చేస్తే గాయంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే , సీజన్ మొత్తానికీ దూరమయ్యాడు. సర్జరీ జరగడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న చాహర్ పూర్తిగా కోలుకునేందుకు ఇంకా 4 నెలలు పట్టే అవకాశముంది. దీంతో దీపక్ చాహర్ సౌతాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్ లకే కాదు ప్రపంచకప్ లో ఆడడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. విండీస్ తో ఫిబ్రవరిలో జరిగిన సిరీస్ సందర్భంగా దీపక్ చాహర్ గాయపడ్డాడు.

3. వాషింగ్టన్ సుందర్ ః
సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఐపీఎల్ ఆడుతుండగానే గాయపడ్డాడు. మొదటిసారి గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన సుందర్ మళ్ళీ రెండో సారి గాయపడడంతో పలు మ్యాచ్ లకు దూరమయ్యాడు. కుడి చేతి బొటనవేలు,చూపుడు వేలికి మధ్య గాయమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సన్ రైజర్స్ , బీసీసీఐ మెడికల్ టీమ్స్ వాషింగ్టన్ సుందర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. అతను కోలుకునేందుకు మరో వారం నుంచి 10 రోజులు సమయం పడుతుందని అంచనా. అయితే వరుస సిరీస్ లు ఉండడంతో సౌతాఫ్రికాతో సిరీస్ సెలక్టర్లు అతన్ని ఎంపిక చేస్తారా అనేది అనుమానమే.

4. టి.నటరాజన్ ః
సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ నటరాజన్ వరుస గాయాలు కూడా భారత్ ను కలవరపెడుతున్నాయి. గాయంతోనే పలు మ్యాచ్ లకు దూరమైన నటరాజర్ ఈ సీజన్ లో నిలకడగా రాణిస్తున్నారు. 9 మ్యాచ్ లలో 17 వికెట్లు పడగొట్టాడు. గత ఏడాది కాలంగా వరుస గాయాలతోనే ఆటకు దూరమైన నట్టూ తరచూ ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో సిరీస్ కు నటరాజన్ ను ఎంపిక చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.