Site icon HashtagU Telugu

Jasprit Bumrah: కేప్ టౌన్ పై బూమ్రా ఎమోషనల్ పోస్ట్

Jasprit Bumrah

Jasprit Bumrah

భారత బౌలింగ్ విభాగంలో అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే స్టార్ పేసర్ గా ఎదిగాడు జస్ప్రీత్ బూమ్రా. ప్రస్తుతం భారత పేస్ దళాన్ని లీడ్ చేస్తున్న బూమ్రా తనదైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాటర్లకు సవాల్ విసురుతున్నాడు. బూమ్రా బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు పలువురు స్టార్ బ్యాటర్లు సైతం ఇబ్బందిపడిన సందర్భాలూ ఉన్నాయి. 2016లో టీ20, వన్డేల నుంచి టీమ్ ఇండియాలో చోటు సంపాదించిన ఫాస్ట్ బౌలర్ బుమ్రా 2018 జనవరి 5న కేప్ టౌన్‌లోనే టెస్టు అరంగేట్రం చేశాడు. బుమ్రా తొలి వికెట్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్‌ అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 వికెట్లు తీశాడు. తాజాగా కేప్ టౌన్ చేరుకున్న భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాతో చివరి టెస్టుకు సన్నధ్ధమవుతోంది. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ లో గెలిస్తే సఫారీ గడ్డపై చరిత్ర సృష్టిస్తుంది.

ఇప్పటి వరకూ అక్కడ టెస్ట్ సిరీస్ గెలవని టీమిండియా ఆ కలను నెరవేర్చుకునేందుకు ఎదురుచూస్తోంది. ఇలాంటి మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా చాలా కీలకం కానున్నాడు. ఎందుకంటే ఇదే మైదానంలో తన కెరీర్ ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేసుకుంటూ బూమ్రా భావోద్వేగానికి గురయ్యాడు. ట్విట్టర్ లో భావోద్వేగంతో కూడిన పోస్టును కూడా చేశాడు. కేప్ టౌన్, జనవరి 2018- ఇక్కడే నాకు టెస్ట్ క్రికెట్ ప్రారంభమైంది. నాలుగు సంవత్సరాల తరువాత మరోసారి ఇక్కడ అడుగుపెట్టాను. ఇన్నేళ్లలో నేను ఒక ఆటగాడిగా, ఒక వ్యక్తిగా మారాను. ఈ మైదానానికి తిరిగి రావడం ప్రత్యేక జ్ఞాపకాలను తిరిగి తెస్తుందంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటివరకు కేవలం 26 టెస్టుల్లో 107 వికెట్లు పడగొట్టాడు. కెరీర్ తొలి మ్యాచ్ లో 4 వికెట్లు పడగొట్టిన బూమ్రా ఇప్పుడు అంతకుమించిన ప్రదర్శన కనబరిచి భారత్ కు చారిత్రక సిరీస్ విజయాన్ని అందించాలని ఎదురుచూస్తున్నాడు.

Exit mobile version