Rinku Singh: స్వీపర్..ఆటోడ్రైవర్..క్రికెటర్.. రింకూ సింగ్ గురించి ఆసక్తికర విషయాలు

తండ్రి గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేస్తాడు... ఉండేది చిన్న ఇల్లు.. స్వీపర్ గానూ పనిచేశాడు.. ఆటోను నడిపాడు.. కుటుంబానికి తన వంతుగా సహకారమందిస్తూనే క్రికెటర్ అవ్వాలన్న లక్ష్యాన్ని వదల్లేదు.

  • Written By:
  • Updated On - April 9, 2023 / 11:42 PM IST

Rinku Singh: తండ్రి గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేస్తాడు… ఉండేది చిన్న ఇల్లు.. స్వీపర్ గానూ పనిచేశాడు.. ఆటోను నడిపాడు.. కుటుంబానికి తన వంతుగా సహకారమందిస్తూనే క్రికెటర్ అవ్వాలన్న లక్ష్యాన్ని వదల్లేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతూనే ప్రాక్టీస్ చేస్తూ ఐపీఎల్ వరకూ వచ్చాడు. ఇప్పుడు ఒక్క మ్యాచ్ తో హీరోగా మారిపోయాడు..
క్రికెటర్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది…కేవలం ఆ కోరిక ఉంటే సరిపోదు…దానికి తగ్గ కృషి , లక్ష్యాన్ని అందుకోవాలన్న పట్టుదల ఉండాలి..ఆర్థికంగా కష్టాలు వెంటాడినా వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తే అది సాధించడం కష్టం కాదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రింకూ సింగ్.

నిజానికి ఐపీఎల్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది.. మధ్యతరగతి, అంతకంటే తక్కువ స్థాయి కుటుంబాల నుంచి వచ్చిన యువక్రికెటర్లను స్టార్ ప్లేయర్స్ గానే కాదు ఆర్థికంగానూ చేయూతనందించింది. ఇదే క్రమంలో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్న రింకూ సింగ్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. గుజరాత్ తో మ్యాచ్ లో ఆఖరి 5 బంతులకు వరుసగా 5 సిక్సర్లు బాదేసి సంచలన ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్ ఇప్పుడు ఐపీఎల్ లో లేటెస్ట్ సెన్సేషన్. ఈ ఇన్నింగ్స్ తర్వాత ఎవరీ రింకూ సింగ్ అంటూ ఫ్యాన్స్ తెగ శోధిస్తున్నారు.

రింకూసింగ్.. చాలా మందిలాగానే దిగువ మధ్యతరగతికి చెందిన యువకుడు. ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ రింకూ సింగ్ స్వస్థలం. రెండు గదులు ఉన్న ఓ చిన్న క్వార్టర్‌లో తొమ్మిదిమంది కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉండేవాడు. తండ్రి ఖన్‌చంద్‌ది గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరి చేసే ఉద్యోగం. చిన్నప్పటి నుంచే రింకూ సింగ్ క్రికెట్ పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడాలనే బలమైన కోరికతో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. కుటుంబాన్ని పోషించడానికి తండ్రి పడే కష్టంలో తానూ పాలుపంచుకునేవాడు. ఓ ప్రైవేట్ కార్యాలయంలో స్వీపర్‌గా కొద్దిరోజులు పని చేశాడు. ఆటోడ్రైవర్‌గానూ కష్టపడ్డాడు.ఓ కోచ్ సాయంతో క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన రింకూ సింగ్.. 2017లో పంజాబ్ కింగ్స్ తరఫున రూ.10 లక్షల బేస్ ప్రైజ్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2018లో కేకేఆర్ అతన్ని రూ.80 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది.

ఆ సీజన్‌లో కేకేఆర్ తరఫున ఆడే అవకాశం అందుకున్నా… ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. మరుసటి సీజన్‌లోనూ విఫలమయ్యారు. 2021లో గాయంతో దూరమైనప్పటకీ… గత సీజన్ మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోని జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుత సీజన్ లో గుజరాత్‌తో ఆడిన తాజా ఇన్నింగ్స్ అతన్ని మరో స్థాయిలో నిలబెట్టింది. రింకూ సింగ్ నుంచి ఈ స్థాయి ఇన్నింగ్స్ ఎవ్వరూ ఊహించలేదు. స్టార్ బ్యాటర్లకు కూడా కొన్ని పరిస్థితుల్లో సాధ్యం కాని అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో మరిచిపోలేని ఇన్నింగ్స్ గా చెబుతున్నారు మాజీలు. అతని కెరీర్ కూడా చాలా మంది యువ ఆటగాళ్ళకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ సీజన్ లో నిలకడగా రాణిస్తే రింకూసింగ్ ను త్వరలోనే టీమిండియా జెర్సీలో చూడొచ్చు.