England vs France: సెమీస్ లో ఫ్రాన్స్.. ఇంగ్లాండ్ ఔట్

సాకర్ ప్రపంచకప్ చివరి సెమీఫైనల్ బెర్తు కూడా ఖరారైంది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. ఇంగ్లీష్‌ జట్టు చివరి వరకూ అద్భుతంగా పోరాడినప్పటికీ..

  • Written By:
  • Updated On - December 11, 2022 / 07:26 PM IST

England vs France: సాకర్ ప్రపంచకప్ చివరి సెమీఫైనల్ బెర్తు కూడా ఖరారైంది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. ఇంగ్లీష్‌ జట్టు చివరి వరకూ అద్భుతంగా పోరాడినప్పటికీ.. ఓటమి నుంచి మాత్రం గట్టెక్కలేకపోయింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే ఫ్రాన్స్ దూకుడుగా ఆడింది. వరుసగా ఇంగ్లాండ్ గోల్ పోస్టుపై దాడులు చేసింది. ఫ్రాన్స్‌ ఆటగాడు అరెలియన్‌ చౌమెనీ అద్భుతమైన కిక్‌తో తమ జట్టుకు తొలి గోల్‌ను అందించాడు. ఇక ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడినప్పటికీ గోల్‌ మాత్రం సాధించలేకపోయాయి.

ఇక సెకండాఫ్ లో బ్రిటన్‌ ఆటగాడు హారీ కేన్‌ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచడంతో స్కోర్ సమమైంది. ఇక్కడ నుంచి మ్యాచ్ మరింత రసవత్తరంగా సాగింది. ఆధిక్యం కోసం ఇరు జట్లూ అద్భుతంగా పోరాడాయి. 78వ నిమిషంలో ఫ్రాన్స్‌ ఆటగాడు ఒలివర్‌ గిరౌడ్‌ సంచలన గోల్‌తో తమ జట్టును 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌కు మరో పెనాల్టీ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీంతో ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. సెమీఫైనల్స్ లో ఫ్రాన్స్ , మొరాకోతోనూ, క్రొయేషియా అర్జెంటీనాతోనూ తలపడనున్నాయి.

అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో మొరాకో , టైటిల్ ఫేవరెట్ పోర్చుగల్ కు షాకిచ్చింది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఖతర్‌కు వచ్చిన మొరాకో జట్టు క్వార్టర్‌ ఫైనల్లో పటిష్టమైన పోర్చుగల్‌ జట్టును ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. లీగ్ స్టేజ్ లో బెల్జియంపై సంచలన విజయం సాధించిన మొరాకో ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తోంది. తమ విజయాలు గాలివాటం కాదని నిరూపిస్తూ క్వార్టర్స్ లో పోర్చుగల్ ను నిలువరించింది. తద్వారా సాకర్ ప్రపంచకప్ సెమీస్ చేరిన తొలి ఆఫ్రికా దేశంగా రికార్డులకెక్కింది.