క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. పాకిస్తాన్ కు చెందిన మాజీ అంపైర్ అసద్ రావూఫ్ ఈ తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. రవూఫ్ సోదరుడు ఈ విషయాన్ని వెల్లడించారు. లాహోర్ లోని లాండ్లా బజార్ లో ఉన్న బట్టల షాపును మూసివేసి ఇంటికి వచ్చిన తర్వాత ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పారని ఆయన సోదరుడు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మరణించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా రవూఫ్ గొప్ప అంపైర్లలో ఒకరిగా నిలిచారు. అలీం దార్ తర్వాత అంతటి వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి రావూఫ్. 2006లో రవూఫ్ ICCఅంపైర్స్ ఎలైట్ ప్యానెల్లో చోటు సంపాదించుకున్నారు. తర్వాత ఆయన 47 టెస్టులు, 98 వన్డేలు, 23 టీ20ల్లో అంపైరింగ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అంపైరింగ్ లో 7ఏళ్లుగా ఫాంలో ఉన్న రవూఫ్ ను 2013లో అంపైర్స్ ఎలైట్ ప్యానెల్ నుంచి తప్పించారు. 1998లో అంపైరింగ్ ప్రస్థానాన్ని ప్రారంభించారు రవూఫ్. పాకిస్తాన్ శ్రీలంక మధ్య 2000వ సంవత్సరంలో జరిగిన మ్యాచ్ తో ఇంటర్నేషనల్ మ్యాచ్ లోకి ప్రవేశించారు. 4ఏళ్ల తర్వాత 2004లో తొలిసారిగా ఇంటర్నేషనల్ అంపైర్ ప్యానెల్లో చోటు దక్కించుకున్నారు. ఆయన తన కెరీర్ లో లాహోర్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్, పాకిస్తాన్ రైల్వేస్, పాకిస్తాన్ యూనివర్సిటీలకు ఆడారు.