Vinod Kambli: ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న సచిన్ స్నేహితుడు

అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటేనే ఏ వ్యక్తి కెరీర్ అయినా నిలబడుతుంది.

  • Written By:
  • Publish Date - August 17, 2022 / 02:17 PM IST

అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటేనే ఏ వ్యక్తి కెరీర్ అయినా నిలబడుతుంది. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మళ్లీ అవకాశాలు రాకపోగా.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ జీవితంలో ఇదే జరుగుతోంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో కలిసి కెరీర్ ప్రారంభించిన కాంబ్లే అనుకున్న స్థాయిలో ఎదగలేకపోయాడు.

టాలెంట్ ఉన్నా నిబద్ధత, పట్టుదల లేక కెరీర్ ను త్వరగానే ముగించేసాడు. సచిన్ తో కలిసి స్కూల్ స్థాయిలో ప్రపంచ రికార్డు నెలకొల్పడం ద్వారా వెలుగులోకి వచ్చిన కాంబ్లే మంచి ఆటగాడే. భారత్ తరపున పలు అంతర్జాతీయ మ్యాచ్ లు కూడా ఆడాడు. అయితే కెరీర్ లో నిలదొక్కుకునే విషయంలో మాత్రం కాంబ్లీ నిర్లక్ష్యం అతని కొంపముంచింది. కట్ చేస్తే ఇప్పుడు బీసీసీఐ ఇచ్చే పెన్షన్ పైనే బతుకుతున్నాడు. ఆ పెన్షన్ సరిపోక ఉద్యోగాల వేటలో ఉన్నాడు కాంబ్లీ. క్రికెట్ కు సంబంధించిన ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ ను కోరుతున్నాడు.

ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమవుతుండడంతో ఉద్యోగం కోసం అభ్యర్థిస్తున్నాడు. 50 ఏళ్ల వినోద్ కాంబ్లీ 2019లో ముంబై టీ ట్వంటీ లీగ్ కు కోచ్ గా పనిచేశాడు. అయితే కోవిడ్ తర్వాత అతని పరిస్థితి దిగజారింది. బీసీసీఐ ఇచ్చే 30 వేల రూపాయల పెన్షన్‌పై బతుకుతున్నట్లు కాంబ్లీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్యూలో వెల్లడించాడు. తన స్నేహితుడు సచిన్ కు చెందిన మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీలో యువ క్రికెటర్లకు కోచింగ్ ఇచ్చేవాడు. అయితే అది చాలా దూరం ఉండటంతో వెళ్లలేకపోతున్నట్లు తెలిపాడు.
క్యాబ్ తీసుకుని అంత దూరం వెళ్లలేకపోతున్నానని, అందుకే ముంబై క్రికెట్ అసోసియేషన్ సాయం కోరుతున్నట్టు చెప్పాడు.
ఏమైనా అవసరముంటే అది వాంఖడే అయినా, బీకేసి ఏదైనా సరే నాకు చెప్పాల్సిందిగా ఇప్పటికే చాలా సార్లు ఎంసీఏని కోరినట్టు తెలిపాడు. మీ ఆర్థిక పరిస్థితి గురించి చిన్ననాటి స్నేహితుడు సచిన్ తెందూల్కర్‌కు తెలుసా? అని కాంబ్లీని అడుగ్గా.. సచిన్‌కు అంతా తెలుసని వినోద్ కాంబ్లీ బదులిచ్చాడు. అయితే సచిన్ నుంచి తాను ఏది కోరుకోవట్లేదన్నాడు. అతడు నాకు తెందూల్కర్ మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీ బాధ్యతలను అప్పగించాడనీ, అందుకే చాలా సంతోషంగా ఉన్నట్టు చెప్పాడు. సచిన్ తనకు మంచి స్నేహితుడనీ, ఎల్లవేలళా అండగా నిలిచాడని గుర్తు చేసుకున్నాడు. వినోద్ కాంబ్లీ భారత్ తరపున 104 వన్డేలు, 17 టెస్టులు ఆడాడు.