Sanjay Bangar : అతన్ని ఓపెనర్ గా పంపండి

జట్టులోకి వచ్చిన కొత్తలో మెరుపులు మెరిపించినయువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదర్కొంటున్నాడు

  • Written By:
  • Publish Date - June 21, 2022 / 06:30 PM IST

జట్టులోకి వచ్చిన కొత్తలో మెరుపులు మెరిపించినయువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదర్కొంటున్నాడు. ఈ పేలవ ఫామ్ నుంచి బయట పడేందుకు అతని బ్యాటింగ్ పొజిషన్ మార్చాలని మాజీలు సూచిస్తున్నారు.
సొంత గడ్డపై సఫారీ టీమ్ తో జరిగిన సీరీస్ ను టీమిండియా డ్రాగా ముగించింది. తొలి రెండు మ్యాచ్ ల్లో ఒడినప్పటికీ తర్వాత అద్భుతంగా పుంజుకుని సీరీస్ సమం చేసింది. కె ఎల్ రాహుల్ గాయంతో దూరమయిన నేపద్యంలో జట్టు కెప్టెన్ గా ఎంపికయిన పంత్ పర్వలేదనిపించాడు. అయితే బ్యాటర్ గా మాత్రం నిరాశ పరిచాడు.

సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన పంత్‌ కేవలం 57 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడి ఆటతీరుపై మాజీ క్రికెటర్‌లు విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా పంత్‌ పెద్దగా రాణించలేకపోయాడు. ఈ క్రమంలో పంత్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ కీలక వాఖ్యలు చేశాడు. రిషబ్‌ పంత్‌ తన ఫామ్‌ను తిరిగి పొందాలంటే అతడికి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని బంగర్‌ సూచించాడు. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ఉదాహరణగా చెప్పుకొచ్చాడు.సచిన్‌ తన వన్డే కెరీర్‌లో తొలి సెంచరీ 75 ఇన్నింగ్స్‌లు తర్వాత సాధించాడనీ మిడిలార్డర్‌లో ఎక్కువగా బ్యాటింగ్‌ చేసిన సచిన్‌ అంతగా రాణించలేకపోయాడనీ గుర్తు చేశాడు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో ఓపెనర్‌గా వచ్చిన సచిన్‌.. తన కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసాడని బంగర్ చెప్పాడు. ప్రస్తుతం భారత జట్టు లెఫ్ట్‌ రైట్‌ కాంబినేషన్‌ కోసం చూస్తుందనీ చెప్పాడు. ఇషాన్‌ కిషన్‌ ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడనీ, ఒక వేళ భారత్‌ ఎక్కువ కాలం పాటు ఇదే కాంబినేషన్‌ కొనసాగించాలంటే.. పంత్‌కు కూడా ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని అభిప్రాయ పడ్డాడు. ఆస్ట్రేలియాకు ఓపెనర్‌గా గిల్‌క్రిస్ట్ చెలరేగి ఆడేవాడో.. పంత్‌ కూడా అదే విధంగా ఆడగలడనీ బంగర్‌ విశ్లేషించాడు. కాగా పంత్ పేలవ ఫామ్ కారణంగా ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అతని స్థానంలో కార్తీక్‌ను ఎంపిక చేయాలని చాలా మం‍ది మాజీలు అభిప్రాయపడుతున్నారు.